లష్కర్లుగా వీఆర్ఏలు.. అందరూ కాదు వీరే.. ఏ ప్రాతిపదికన అంటే..
రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన వీఆర్వో సేవలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుతో ఉద్యోగులు ఉన్నా.. ఇతర పనులను చేయిస్తున్నారు. ఇక వారి అసిస్టెంట్లు వీఆర్ఏలకు కూడా రకరకాల పనులు చెప్తున్నారు. రెవెన్యూ విభాగం కింద దాదాపు 32 డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. సో మిగతా పనులను వీఆర్ఏలకు అప్పగిస్తామని ఇదివరకే ప్రతిపాదన చేసింది. దానిని అమలు చేసింది.

3357 మంది వీఆర్ఏలు
గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌లలో పదో తరగతి లోపు విద్యార్హతలు ఉన్న 3,357 మందిని చెరువులపై లష్కర్ (మస్కూరీ, నీరడి)లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల శాఖలోకి మార్చాలనే ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దీంతో సీసీఎల్‌ఏ అధికారులు జిల్లాల వారీగా పదో తరగతిలోపు అర్హతలు ఉన్న వీఆర్‌ఏల జాబితాను సచివాలయానికి ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 10,724 మంది వీఆర్‌ఏలు ఉన్నారని, వీరిలో 3,730 మంది వీఆర్‌ఏలకు 10వ తరగతిలోపు చదివారని ఆ నివేదికలో వెల్లడించారు.

ఆ మేరకే భర్తీ
నీటిపారుదల శాఖలో 3,357 లష్కర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండటంతో అంతమంది వీఆర్‌ఏలనే రెవెన్యూ నుంచి ఇరిగేషన్ శాఖకు మారుస్తారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఫైల్ రెవెన్యూ శాఖ వద్దకు చేరింది. సదరు ఉద్యోగులను రెవెన్యూ నుంచి నీటిపారుదల శాఖకు బదిలీ చేసేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించారని, రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉత్తర్వులు వెలువడుతాయని వెల్లడించారు.

గతంలో లష్కర్ పోస్టు
రాష్ట్రంలో చెరువులు, కుంటలు, కాలువల పర్యవేక్షణ కోసం గతంలో లష్కర్ పోస్టు ఉండేది. పదవీ విరమణ పొందిన లష్కర్‌ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం మిషన్ కాకతీయతో చెరువులు, కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. వీటి పర్యవేక్షణకు లష్కర్ పోస్టు అనివార్యంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతి కోరుతూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని తోసిపుచ్చిన ప్రభుత్వం.. పదోతరగతి లోపు అర్హత ఉన్న వీఆర్‌ఏలను లష్కర్‌లుగా నియమించుకోవాలని స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications