సమీర్ మహీంద్రుతో సంబంధమేంటి?: లిక్కర్ స్కాంలో కవిత పేరుపై తరుణ్ ఛుగ్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జీషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి రావడంపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో కవిత సమావేశాలు జరిపారని ఈడీ చెప్పిందన్నారు. ఈ సమావేశాల వెనకున్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు.

సమీర్ మహీంద్రుతో కలిసి లిక్కర్ స్కాం ద్వారా కవిత దోపిడీ: తరుణ్
లిక్కర్ స్కాంలో సమీర్ మహీంద్రుతో కవితకు ఉన్న సంబంధాలేంటో కూడా తెలియాలన్నారు. తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం దోపిడీ.. ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు వెల్లడవుతాయని, వీరందరికీ కఠిన శిక్షలు పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. సమీర్ మహీంద్రుతో కలిసి లిక్కర్ స్కాం ద్వారా కవిత దోపిడీ చేశారన్న తరుణ్ ఛుగ్.. ఈ అంశంలో కేసీఆర్ మౌనం వహించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాం పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. ఛార్జీషీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలన్నారు.

కవిత ఎన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలన్న తరుణ్ ఛుగ్
కవిత ఎందుకు ఎన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని తరుణ్ ఛుగ్ డిమాండ్ చేశారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని, అసలు సమీర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్న వారంతా కవిత ఇంటికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. కాగా, మంగళవారం ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటులో కవిత పేరు మరోసారి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ తెలంగాణ నుంచి ఢిల్లీకి.: తరుణ్
అవినీతి ఆరోపణల నుంచి బయట పడేందుకే పార్టీ పేరును బీఆర్ఎస్గా కేసీఆర్ మార్చుకున్నారని తరుణ్ ఛుగ్ ఆరోపించారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందరూ లిక్కర్ స్కాంలో ఉన్నారన్నారు. కుటుంబవాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్ ఈ ప్రణాళికలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లను కలిశారన్నారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమేనన్న తరుణ్ చుగ్... దాని వెనుక కూడా లిక్కర్ స్కాం ఉందని ఆరోపించారు. స్కాంలో నిందతులంతా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications