తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారు: కేసీఆర్ పుట్టిన రోజునే
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17నే నూతన సచివాలయం ప్రారంభం
ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి వేముల తెలిపారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేస్తున్నారు.

సీఎం కార్యాలయం లేదంటే మొత్తం భవనం ప్రారంభం
అంతేగాక, సచివాలయం ఆవరణలో మందిరం, మసీదు, చర్చీలను కూడా నిర్మిస్తున్నారు. అయితే, సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం భవన సముదాయానికి మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్థు, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి.

వేగంగా జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులు
సచివాలయ భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుంటున్నారు. పనుల వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది.

రూపుదిద్దుకుంటున్న తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలు
మరోవైపు, సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం పనులు తుది దశకు చేరుకున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సచివాలయం సమీపంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులు వేగంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications