
వంద మంది రైతులపై దేశద్రోహం కేసు, ఎందుకంటే..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దేశద్రోహం కేసులు ఫైల్ అవుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అలా అభిప్రాయపడిందో లేదో.. హర్యానాలో దేశద్రోహం కేసు ఫైల్ అయ్యింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మంది రైతులపై అభియోగం మోపారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ హర్యానాలో రైతులు కూడా నిరసన తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ రణబీర్ కారుపై రైతులు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన హర్యానాలో గల సిర్సాలో ఘటన జరిగింది. అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత దేశ ద్రోహ అభియోగం, హత్యాయత్నం కేసులు మోపారు. రైతు నేతలు హర్ చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. దీనిని సంయుక్త్ కిసాన్ మోర్చ ఖండించింది. తప్పుడు అభియోగాలు నమోదు చేశారని.. కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని చెప్పారు.

రైతు నేతలు సహా వంద మంది అన్నదాతలపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. దేశ ద్రోహ కేసులు నమోదు చేసే సమయంలో చట్టబద్దత ఏం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ చట్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేయడం లేదు అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు అడిగింది. పోలీస్ అధికారి ఎవరిపైనైనా 124 ఏ సెక్షన్ నమోదు చేయాలని అనుకుంటే.. వెంటనే ఫైల్ చేయొచ్చు అని చెప్పారు.