దేశంలో కొత్త గర్భ నిరోధక సాధనం; అందుబాటులోకి తెస్తున్న కేంద్రం; దీని ప్రత్యేకతలు ఇవే!!
దేశంలో కొత్త గర్భనిరోధక ఇంప్లాంట్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. దాని విశేషాలు తెలుసుకోండి.
గర్భనిరోధక పద్ధతులలో ఇప్పటి వరకే అమలులో ఉన్న పద్ధతులు కాకుండా మరో కొత్త పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఇప్పటివరకు గర్భనిరోధక సాధనాలైన టాబ్లెట్లు, ఇంజక్షన్లు, కండోమ్ లు, కాపర్ టీ లాంటి సాధనాలు మాత్రమే కాకుండా తాజాగా మరొక కొత్త గర్భనిరోధక సాధనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది భారత ప్రభుత్వం. మోచేతి చర్మం కింద పై పొరలో తేలికపాటి సూది మాదిరిగా ఉన్న ఒక సన్నటి సాధనాన్ని అమర్చి గర్భం రాకుండా నిరోధించనుంది.

గర్భ నిరోధానికి కొత్త సాధనం ప్రత్యేకత ఇదే
ఈ విధానంలో ప్రత్యేకత ఏమిటంటే మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవు, రెండు నుండి నాలుగు మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ సాధనం గర్భాన్ని నిరోధించే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. అసలు ఈ సాధనమే హార్మోన్ తో తయారవుతుంది. ఇది మహిళ యొక్క అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. బిడ్డకు బిడ్డకు మధ్య దూరం ఉండాలని కోరుకునే భార్యాభర్తలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్.. ఎంత కాలం పని చేస్తుందంటే
ఇంతకుముందు ఉన్న గర్భనిరోధక సాధనాల లాగా సైడ్ ఎఫెక్టులు కానీ, ఇతరత్రా ఇబ్బందులు కానీ దీనితో ఉండవని భావిస్తున్నారు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ గా పేర్కొంటున్నారు. ఈ కొత్త విధానంతో పాత విధానంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అని భావిస్తున్నారు. ఈ విధానంలో ఈ సాధనం మూడేళ్ళ వరకు గర్భం రాకుండా నిరోధిస్తుంది. ఇంకా గ్యాప్ కావాలంటే పాత దానిని తీసేసి కొత్త సాధనం ఇంప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది.

భయాలకు చెక్ .. ఈజీగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గర్భ నిరోధం
ఇక ఈ సాధనాన్ని అమర్చడం చాలా సులువు. దీనిని డాక్టర్లే ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిని స్టాఫ్ నర్స్ కూడా ఇంప్లాంట్ చేయవచ్చు. అవసరం లేదనుకుంటే ఈజీగా తీసేయొచ్చు. ఈ సాధనం తీసేసిన తర్వాత 48 గంటల తరువాత గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గర్భనిరోధకానికి ఇప్పటివరకు అవలంబించిన కాపర్ టీ విషయంలో మహిళలకు విపరీతమైన భయాలు ఉన్నాయి. అటువంటి భయాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా ఈ విధానం ద్వారా సులువుగా గర్భనిరోధాన్ని అమలు చేయవచ్చు.

ఇంజక్షన్ చేసినంత సులువుగా గర్భ నిరోధ సాధనం ఇంప్లాంట్
ఇక ఈ సాధనాన్ని అమర్చటం కేవలం ఒక ఇంజక్షన్ చేసినంత సులువు. ఇక కుడి చేతివాటం ఉన్నవారికి ఎడమ మోచేతి కింద, ఎడమ చెయ్యి వాటమున వారికి కుడి చెయ్యి మోచేతి కింద ఈ సాధనాన్ని అమరుస్తారు. దీంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విధానం చాలా దేశాలలో అందుబాటులో ఉంది. దీంతో మన కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

దేశంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో త్వరలో అందుబాటులోకి కొత్త విధానం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా తమిళనాడు, అస్సాం, కర్ణాటక, గుజరాత్. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలో దీనిని అమల్లోకి తీసుకురావడం గురించి ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుంది. కెన్యాలో ఈ విధానం గత 20 25 ఏళ్లుగా అమల్లో ఉంది. కొంతకాలం క్రిందట కెన్యాలో పర్యటించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం దీనిపై అధ్యయనం చేసి, ఈ సాధనం వల్ల వచ్చిన ఫలితాలను కూడా తెలుసుకొని, ఈసాధనం తో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని గుర్తించి మనదేశంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇచ్చిన నివేదికతో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తుంది. ఏది ఏమైనా భారతదేశంలో గర్భనిరోధక పద్ధతులను అవలంబించేవారు ప్రతి సంవత్సరం లక్షల్లోనే ఉంటారు. వారందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications