Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయాణంలో మరో కీలక దశ-ఈ రాత్రి కౌంట్ డౌన్ మొదలు..
చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతంగా ఒక్కో దశ దాటుకుంటూ ముందుకెళ్తోంది. చంద్రుడిపై నిగూఢ రహస్యాలు వెలికి తీసే లక్ష్యంతో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 నౌక ఇవాళ మరో కీలక దశలోకి ప్రవేశించబోతోంది. దీని కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ విజయవంతమైతే ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు తమకు ఉపయోగపడతాయన్న ఆశతో ఎన్నో దేశాలు, శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగంగా ఇప్పటికే నాలుగు దశల్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ నౌక.. ఇప్పుడు ఐదో దశలో సాగుతోంది. ఈ దశ కూడా పూర్తి చేసుకుని ఇవాళ అర్ధరాత్రికి ఆరో దశగా భావిస్తున్న చంద్రుడి కక్షలోకి ప్రవేశించబోతోంది. ఈ క్షణం కోసం ఇస్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంట నుంచి 1 గంట మధ్య చంద్రయాన్-3 నౌక చంద్రుడి కక్షలోకి ప్రవేశించబోతోంది. ఇందులో ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం రాత్రికి కౌంట్ డౌన్ మొదలవుతోంది.

ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావాల్సి ఉంది. ఇందుకోసం సాగే సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికే పలుదశలు దాడిన చంద్రయాన్-3.. ఇవాళ చంద్రుడి కక్షలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం మరింత కీలకంగా మారనుంది. అలాగే ఈ ప్రయాణంలో వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం, అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్దితుల్ని దాటుకుంటూ నౌక ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రుడి కక్షలో సవ్యంగా సాగడం, ఆ తర్వాత చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కావడం ప్రతీదీ సవాల్ గానే ఉండబోతోంది.
భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం 3.8 లక్షల కిలోమీటర్లు. ఇందులో ప్రతీ 1.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణానికీ చంద్రయాన్-3కి పట్టే సమయం 51 గంటలు. అలాగే చంద్రయాన్ వెళ్లే రూటు ప్రకారం చూస్తే ఈ దూరం 3.6 లక్షల కిలోమీటర్ల నుంచి 4 లక్షల కిలోమీటర్ల మధ్యన కూడా ఉండొచ్చని అంచనా. చంద్రుడి కక్షలోకి చంద్రయాన్-3 నౌక అడుగుపెట్టిన తర్వాత ఇస్రో దీని ప్రయాణ వ్యాసార్ధ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. చివరికి 100 కిలోమీటర్ల వ్యాసంలోకి ప్రవేశపెడుతోంది. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ ను ఆగస్టు 17న విడదీస్తుంది. చివరిగా ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ మాత్రం ల్యాండ్ అవుతుంది.












Click it and Unblock the Notifications