డిప్యూటీ సీఎం నియామకం రాజ్యాంగ విరుద్దమా ? తేల్చబోతున్న హైకోర్టు..!
గతంలో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులు మాత్రం ఉండేవి. ఆ తర్వాత క్రమంగా ఒకరిని చూసి మరొకరు డిప్యూటీ సీఎంలను (Deputy CM) నియమించడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో, ఇప్పటికీ ఈ తంతు నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే ఈ డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ బద్దత ఉందా ? ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఒరిస్సా హైకోర్టు సిద్దమైంది.
ఒడిశాలో ఉప ముఖ్యమంత్రుల నియామక రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం బీజేపీ నేతలు కనక్ వర్ధన్ సింగ్ దేవు, ప్రవతీ పరిదాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సీజే జస్టిస్ హరీష్ టాండన్, జస్టిస్ చిత్తరంజన్ దాష్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 163, 164 ప్రకారం గవర్నర్‌కు సహాయపడేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి మాత్రమే ఉండాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగంలో ఎక్కడా తావులేదని వాదించారు. ఈ ప్రత్యేక నియామకాల ద్వారా మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు, ఇతర మంత్రులు అనే విభజనతో కొత్త మూడు అంచెల వ్యవస్థను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.

అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య ఈ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉప ముఖ్యమంత్రులు కూడా సాధారణ మంత్రులలో భాగమేనని, కేవలం డిప్యూటీ సీఎం అనే హోదా ఇచ్చినంత మాత్రాన అది రాజ్యాంగ ఉల్లంఘన కాబోదని స్పష్టం చేశారు. మంత్రుల జీతభత్యాలను నిర్ణయించే అధికారం రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ (స్టేట్ లిస్ట్) లోని ఎంట్రీ 40 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. గత తీర్పుల్ని ఉదహరించారు. ఈ విచారణ సందర్భంగా ఒరిస్సా హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన వ్యక్తులు కూడా మంత్రిమండలిలో భాగమేనని గుర్తు చేసింది. ముఖ్యమంత్రి మినహా ఇతర మంత్రుల విభజన లేదా హోదాల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక నిషేధాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు, చట్టపరమైన ఆధారాల పరిశీలన అనంతరం హైకోర్టు ఈ కేసులో తన తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.














Click it and Unblock the Notifications