దేశంలో తొలి మంకీపాక్స్ కేసు: డిశ్చార్జ్ చేస్తామంటోన్న కేరళ ఆరోగ్య శాఖ
మంకీపాక్స్ కలవరపెడుతోంది. దేశంలో మంకీ పాక్స్ వైరస్ సోకిన తొలి వ్యక్తి కోలుకున్నారు. చికిత్స తర్వాత ఆరోగ్యవంతులు అయ్యారని.. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సదరు పేషెంట్ నుంచి సేకరించిన అన్ని శాంపిళ్లను రెండు సార్లు పరీక్షించగా.. మంకీ పాక్స్ నెగిటివ్ వచ్చిందని తెలిపింది. సదరు వ్యక్తి ఫిట్ గా ఉన్నారని.. శనివారమే డిశ్చార్జి చేస్తున్నామని ప్రకటించింది.
కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 14న దేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఆయనను తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐసోలేషన్ ఉంచి చికిత్స అందించారు. తాజాగా మంకీ పాక్స్ లక్షణాలు తగ్గిపోవడంతో.. గత మూడు రోజుల్లో రెండు సార్లు శాంపిల్స్ పరీక్షించగా నెగిటివ్ వచ్చింది.కేరళలోనే మంకీ పాక్స్ పాటిజివ్ ఉన్న మరో ఇద్దరికీ చికిత్స కొనసాగుతోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఆ ఇద్దరూ కోలుకుంటున్నారని తెలిపారు.

మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ఇంగ్లాండ్ పరిశోధకుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చునని పేర్కొంది. 16 దేశాల్లో 528 మంకీపాక్స్ కేసులను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. దీనిపై జూలై 21న '16 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్-ఏప్రిల్-జూన్ 2022' పేరుతో ఇంగ్లాండ్‌లో ఒక జర్నల్ ప్రచురితమైంది.












Click it and Unblock the Notifications