ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!
Recommended Video

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్ లక్షంగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని సమాచారం. ఇంతకాలం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలుకుబడిని అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున ఆదాయపన్ను ఎగవేశారని ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టీటీవీ దినకరన్ కు చెందిన చెన్నైలోని బెసెంట్ నగర్ లోని ఇంటిలో, శశికళ భర్తకు చెందిన తంజావూరులోని ఇంటిలో రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారని తెలిసింది. జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

జయలలిత హయాంలో అన్నాడీఎంకే పార్టీకి గొంతుకగా ఉన్న జయ టీవీ, నమధు డాక్టర్ ఎంజీఆర్ దిన పత్రిక కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ సోదాలు జరిగాయి. జయ టీవీలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూసింది. జయ టీవీ లో స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జయ టీవీ ఎండీగా ఉన్న శశికళ మేనల్లుడు వివేక్ జయరామన్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు శశికళ కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించే పనిలో నిమగ్నం అయ్యారు.












Click it and Unblock the Notifications