వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్వంత్‌ సింగ్‌: వాజపేయికి ‘హనుమంతుడు’ ఎలా అయ్యారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారతదేశ విదేశాంగ, ఆర్థిక, రక్షణ మంత్రిగా బాగా గుర్తింపు పొందిన కొద్దిమంది నాయకులలో జస్వంత్‌ సింగ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు 1998 అణు పరీక్షలు. భారతదేశంపట్ల ప్రపంచానికి ఉన్న దురభిప్రాయాలను తొలగించడం అప్పట్లో ఆయన ముందున్న బాధ్యత. జస్వంత్‌ సింగ్ ఈ పాత్రను విజయవంతంగా పోషించారు.

Jaswant singh

అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి స్ట్రోబ్‌ టాల్బోట్‌తో జస్వంత్‌సింగ్‌ రెండేళ్లలో ఏడు దేశాలు, మూడు ఖండాల్లో 14 సార్లు భేటీ అయ్యారు. ఆఖరికి క్రిస్టమస్‌ రోజున కూడా వారిద్దరు సమావేశమయ్యారు. వారిమధ్య సంబంధాలు అలా ఉండేవి.

“ఎంగేజింగ్ ఇండియా: డిప్లొమసీ, డెమోక్రసీ అండ్ ది బాంబ్’' అనే పుస్తకంలో టాల్బోట్‌ పలు ఆసక్తికరమైన విషయాలు రాశారు. "ఈ ప్రపంచంలో నేను కలుసుకునే అవకాశం పొందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో జస్వంత్‌ ఒకరు. ఆయన ఒక ప్రజ్జావంతుడైన వ్యక్తి. చాలా స్పష్టంగా మాట్లాడతారు’’ అని కితాబునిచ్చారు.

“భారతదేశ దృక్పథాన్ని ఆయనకన్నా ఎవరూ బాగా వివరించలేరు. ఆయనవల్లే క్లింటన్‌ భారత పర్యటన సాధ్యమైంది’’ అని టాల్బోట్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

అయితే జస్వంత్ సింగ్‌పై 2004లో విదేశాంగ మంత్రి అయిన నట్వర్‌ సింగ్‌ విమర్శలు చేశారు. జస్వంత్ తనకు సమాన హోదాలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మేడలిన్‌ ఆల్‌బ్రైట్‌తో కాకుండా విదేశాంగా శాఖ ఉప మంత్రితో ఎక్కువగా మాట్లాడారని విమర్శించారు.

అనర్గళంగా ఇంగ్లిష్‌ ప్రసంగాలు

రాజస్థాన్‌లోని బార్మెర్‌ జిల్లా జాసోల్‌ గ్రామంలో 1938 జనవరి 3న జన్మించిన జస్వంత్‌ సింగ్‌ భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులలో ఒకరు.

ఆయనకు ఆరెస్సెస్‌ నేపథ్యం లేదు. అజ్మీర్‌లోని ప్రసిద్ధ మేయో కాలేజీలో చదువుకున్నారు. విశేషం ఏంటంటే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగల జస్వంత్‌ సింగ్‌కు కాలేజీలో చేరేనాటికి ఇంగ్లిష్ తెలియదు.

"ఇంగ్లిష్‌ మాట్లాడలేకపోవడం నాకు చాలా అవమానంగా ఉండేది. నేర్చుకోవడానికి ఎవరినైనా సహాయం కోరడం ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడంగా భావించాను. అందుకే నాకు నేనుగానే ఇంగ్లిష్ నేర్చుకోవడమే కాదు, అందులో ప్రావీణ్యం కూడా సంపాదించాను’’ అని జస్వంత్‌ తన ఆత్మకథ 'ఎ కాల్ టు ఆనర్'లో రాసుకున్నారు.

చట్టసభల్లో జస్వంత్‌ సింగ్‌ గొంతు వినగానే సభ యావత్తు నిశ్శబ్దంగా మారేది. ఆయన చెప్పే విషయాలను సభ్యులు జాగ్రత్తగా వినేవారు. ఆర్థికమంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీ తన బడ్జెట్‌లో వృద్ధులకు కొంత పన్ను రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించగా, మీరు ఇచ్చిన డిస్కౌంట్‌తో విస్కీ బాటిల్ కూడా కొనలేమని జస్వంత్‌ వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ రాణికి గొడుగు పట్టిన జస్వంత్‌ సింగ్‌

1954లో జస్వంత్‌ సింగ్‌ డెహ్రాడూన్‌లోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీకి ఎంపికయ్యారు. అక్కడ ఆయనకు అకాడమీ కమాండెంట్ మేజర్ జనరల్ హబీబుల్లాతో పరిచయం ఏర్పడింది. ఒక విధంగా ఆయన జస్వంత్‌ సింగ్‌ను దత్తత తీసుకున్నారు.

కొద్ది రోజుల తర్వాత నేషనల్ డిఫెన్స్‌ అకాడెమీని పుణెకు సమీపంలోని ఖడక్‌ వాస్లాకు తరలించారు. అక్కడే జస్వంత్‌ సింగ్‌ తొలిసారి జవహర్‌లాల్ నెహ్రూను చూశారు. అదే సమయంలో సోవియట్ యూనియన్‌కు చెందిన జనరల్‌ మార్షల్‌ జుకోవ్‌తో షేక్‌హ్యాండిచ్చే అవకాశం దక్కింది.

అక్కడ పర్యటించిన సోవియట్ నాయకులు నికిటా కృశ్చేవ్‌, బుల్గానిన్‌లను ఆయన దగ్గరగా చూశారు. అదే సమయంలో ఇరాన్‌ రాణి సురయ్యాకు గొడుగు పట్టుకోడానికి హబీబుల్లా జస్వంత్‌సింగ్‌ను ఎంపిక చేశారు.

జస్వంత్‌ సింగ్‌ ఈ సందర్భంగా జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని వర్ణించారు. “రాణి సురయ్య కారు నావైపు కదులుతోంది. అప్పుడు నేను పెద్ద రంగురంగుల గొడుగును తెరవడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో పెద్దగాలి వచ్చింది. గొడుగు ఎగిరి పోయినంతపనైంది. అక్కడే ఉన్న హబీబుల్లా ఈ దృశ్యాన్ని నోరు తెరిచి చూస్తూ నిలబడ్డారు’’ అని రాశారు.

"కారు నాకు ఇంకా 20 మీటర్ల దూరంలో ఉంది. మరోసారి బలంగా వీచిన గాలికి గొడుగు దాదాపు తలకిందులైంది. జనరల్ హబీబుల్లా ముఖం కోపంగా, చిరాకుగా కనిపిస్తోంది. నేను ఏదో విధంగా ఆ గొడుగును కంట్రోల్‌లోకి తెచ్చాను. తర్వాత జనరల్‌ నన్ను కోప్పడ్డారు. 'యూ బ్లడీఫూల్‌, మీ ఎడారి రాజస్థాన్‌లో నీకు గొడుగు తెరవడం కూడా ఎవరూ నేర్పలేదా’ అన్నారు’’ అని జస్వంత్‌ తెలిపారు.

జస్వంత్‌ను మంత్రిని చేయడానికి అడ్డుకున్న ఆరెస్సెస్‌

1966లో జస్వంత్‌ సింగ్‌ 9 సంవత్సరాల సర్వీసు తర్వాత ఆర్మీ పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం జోధ్‌పూర్‌లో మహారాజా గజ్‌సింగ్‌కు ప్రైవేట్ కార్యదర్శిగా పని చేశారు.

1980లో బీజేపీ టికెట్‌పై తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో వాజపేయి 13 రోజుల ప్రభుత్వంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేశారు. వాజపేయి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జస్వంత్‌ సింగ్‌ను మళ్లీ ఆర్థికమంత్రిగా చేయాలనుకున్నారు. కానీ ఆయన నియామకాన్ని ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది. బాధపడ్డ వాజపేయి ఆయన్ను ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు.

మంత్రి పదవి విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకతపై జస్వంత్‌ను ప్రశ్నించినప్పుడు “తాము లేకుండా ఈ ప్రపంచం నడవదనుకునే వారు సమాధులలో ఉన్నారు. కానీ ప్రపంచం నడుస్తూనే ఉంది. నేను ఆ పదవిలో ఉండాలని ఏమీ లేదు. నేను లేకపోయినా అది నడుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

కొద్ది రోజుల తరువాత వాజపేయి ఆయన్ను విదేశాంగ మంత్రిని చేశారు. 2002 వరకు విదేశాంగ మంత్రిగా జస్వంత్‌ కొనసాగారు. తరువాత ఆయన మళ్లీ ఆర్థికమంత్రి అయ్యారు.

అద్వానీ రథయాత్ర, అయోధ్య ఉద్యమాలపై ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. బీజేపీలోని ఒక వర్గం జస్వంత్‌ సింగ్‌ పట్ల వ్యతిరేకతను కొనసాగించింది.

కానీ అటల్‌ బిహారీ వాజపేయి, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ వంటి సీనియర్ల ఆశీస్సుల కారణంగా ఆయన పార్టీలో ఎదిగారు. జస్వంత్‌ ఇంగ్లిష్‌ ప్రసంగాలను వాజపేయి ఎంతో ఇష్టపడేవారు.

వాజపేయితో సాన్నిహిత్యం

జస్వంత్‌ సింగ్‌ను దగ్గరగా చూసిన వారు ఆయన సంస్కారవంతుడని, విషయ పరిజ్ఞానం ఉన్నవాడని నమ్ముతారు. మాట్లాడటం ఒక కళ. అది కొద్దిమందికే ఉంటుంది. ఆయన చెప్పే ప్రతిమాట ఆలోచనాత్మకంగా ఉంటుంది.

"ఆయనలాగా మంచి మనసు ఉన్నవారు భారత రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. తన కెరీర్‌లో ఆయన ఎప్పుడూ సైనిక క్రమశిక్షణను వదిలిపెట్టలేదు. 53 సంవత్సరాల కిందట ఆయన కేవలం తన సైనిక యూనిఫాంను మాత్రమే వదులుకున్నారు" అన్నారు సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభుచావ్లా.

"వాజపేయితో సన్నిహితంగా ఉండటానికి కారణం విశ్వసనీయతే. తాను వాజపేయికి నమ్మినబంటునని ఆయన అంగీకరించారు. పైగా వాజపేయికి ఆయన నుంచి ఎలాంటి రాజకీయ ముప్పు లేదు” అని ప్రభు చావ్లా వ్యాఖ్యానించారు.

ప్రజాజీవితంలో అనుబంధం తక్కువ

జస్వంత్‌ సింగ్‌ రాజకీయ జీవితంలో ఒక లోపం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ప్రజా రాజకీయాలలో లేరు. తన నియోజకవర్గానికి సేవ అన్నదాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదనే విమర్శ ఉంది.

1989లో జోధ్‌పూర్‌ నుంచి, చిత్తోడ్‌గడ్ నుంచి 1991, 1996 సంవత్సరాలలో, తరువాత 2009లో డార్జిలింగ్‌ నుంచి జస్వంత్‌ గెలిచారు. కానీ ఆయన తమను ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రజలు ఫిర్యాదు చేసేవారు.

ఆయన ఒక్కోసారి తన నేత అటల్‌ బిహారీ వాజపేయికి ట్రబుల్ షూటర్‌గా పని చేసేవారు. జయలలిత, వాజపేయి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారు. మరోసారి జనరల్‌ ముషారఫ్‌కు చెక్‌ పెట్టేందుకు సమాలోచనలు చేసేవారు. అందుకే ఆయన్ను తన 'హనుమంతుడు’ అని వాజపేయి సరదాగా అంటుండేవారు.

కాందహార్ విమానం హైజాక్ వ్యవహారంలో విమర్శలు

తీవ్రవాదులు విమానం హైజాక్‌ చేసి కాందహార్‌ తీసుకుపోయిన సందర్భంలో ముగ్గురు తీవ్రవాదులను విడుదల చేయడంపై జస్వంత్‌ సింగ్‌ మీద విమర్శలు వెల్లువెత్తాయి. తాను అధికారుల సలహా మేరకు ఈ పని చేయాల్సి వచ్చిందని జస్వంత్ సింగ్ వివరణ ఇచ్చుకున్నారు.

"విమానం హైజాక్‌ అయినప్పుడు అజిత్ డోభాల్, సిడి సహే, వివేక్‌ కట్జులలో ఒకరిని కాందహార్‌కు పంపాలని చెప్పారు. అక్కడ అవసరమైనప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంది" అని తన ఆత్మకథ 'ఎ కాల్ టు ఆనర్'లో రాశారు జస్వంత్‌ సింగ్‌.

"మొదట ఉగ్రవాదులు జైళ్లలో ఉన్న తమ 40 మంది ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేసినా, మేం ముగ్గురిని విడుదల చేయడానికి అంగీకరించాం. చివరి నిమిషంలో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తితే, దిల్లీలో ఎవరినో ఒకరిని సంప్రదించడంకన్నా నేనే అక్కడ ఉండటం మంచిదని నిర్ణయించుకున్నాను. అందుకే కాందహార్‌ వెళ్లాను" అని రాసుకున్నారు జస్వంత్‌ సింగ్‌.

"ఈ విషయంలో జస్వంత్‌ సింగ్‌పై విమర్శలు సరికాదు. అది ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. మంత్రివర్గం నిర్ణయం” అన్నారు వివేక్‌ కట్జు. ఆయన జస్వంత్‌సింగ్ పదవీ‌ కాలంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేశారు.

"దీనికి ఒక లక్ష్యం ఉంది. విమానంలో చిక్కుకున్న భారతీయులను ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా తీసుకురావాలన్నదే ఆ లక్ష్యం. విమర్శలు చేసేవారు ఆ లక్ష్యాన్ని విస్మరిస్తున్నారు’’ అని వివేక్‌ కట్జూ అన్నారు.

వాజ్‌పేయి - ముషారఫ్‌ సమావేశం వెనుక జస్వంత్‌

జస్వంత్‌ సలహా మేరకే అటల్‌ బిహారీ వాజపేయి ఆగ్రాలో జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌తో శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. కానీ ఉమ్మడి ప్రకటనపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

“ముషారఫ్‌ ఆగ్రా శిఖరాగ్ర సదస్సు ప్రాముఖ్యతను అర్ధం చేసుకోలేకపోయారు. జస్వంత్‌ సింగ్‌ దూరదృష్టి ప్రదర్శించగా, ముషారఫ్‌ మాత్రం తన కమాండర్ల మాటలే విన్నారు’’ అని వివేక్‌ కట్జూ వ్యాఖ్యానించారు.

అజ్మీర్‌లోని ఖాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా సందర్శనకు ముషారఫ్‌ను ఎందుకు అనుమతించలేదని పాకిస్తాన్‌ విలేకరులు జస్వంత్‌ సింగ్‌ను అడిగారు. "ఆయన గరీబ్‌ నవాజ్‌ దర్గాకు వెళ్లారు కదా. అక్కడి వాళ్లకు ఫోన్‌ చేసి ఈ ప్రశ్న అడగండి’’ అని జస్వంత్‌ సమాధానమిచ్చారు.

బీజేపీ నుంచి బహిష్కరణ

జస్వంత్ సింగ్ ''జిన్నా ఇండియా - పార్టిషన్‌ ఇండిపెండెన్స్‌" అనే పుస్తకం విడుదల చేసిన రెండు రోజులకే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఆ పుస్తకంలో ఆయన జిన్నాను పొగిడారని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 ఆగస్టులో సిమ్లాలో జరిగిన పార్టీ సమావేశంలో సందర్భంగా ఆయన్ను బహిష్కరించారు.

బీజేపీ సమావేశ స్థలానికి కొద్ది దూరంలో ఉన్న హోటల్‌లో జస్వంత్‌ సింగ్‌ ఉన్నారు. ''మీరు అక్కడికి రావడానికి ఇబ్బంది పడవద్ద’’ని జస్వంత్‌ సింగ్‌కు కొందరు చెప్పారు.

కాసేపటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆయనకు తెలిసింది.

పార్టీ నాయకత్వంతో ముఖాముఖి మాట్లాడటానికి కూడా నిరాకరించడం విచారకరం అని కన్నీరు పెట్టుకున్నారు జస్వంత్‌ సింగ్‌. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా తాను వారి నుంచి ఎంతో మర్యాదను ఆశించానని, కానీ అలా జరగలేదని ఆవేదన చెందారు.

ఆరు సంవత్సరాల పాటు కోమాలో

గుర్రపు స్వారీ, సంగీతం, పుస్తకాలు, గోల్ఫ్, చెస్‌ పట్ల అభిమానం ఉన్న జస్వంత్ సింగ్ ఎప్పుడూ తనను తాను 'లిబరల్ డెమొక్రాట్' అని అభివర్ణించుకుంటారు.

2014 ఎన్నికలకు ఒక రోజు ముందు ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో తలకు బలమైన గాయమైంది. ఆరు సంవత్సరాల పాటు ఆయన దాదాపు కోమాలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

ఈ ఆరు సంవత్సరాలలో జార్జ్‌ ఫెర్నాండెజ్‌, అటల్‌ బిహారీ వాజపేయి వంటి సీనియర్‌ నేతలు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్లి పోయారు. కానీ వారు చనిపోయిన విషయం కూడా ఆయనకు తెలియదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jaswant Singh: How did Vajpayee become 'Hanuman'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X