IPL 2023 : మూలిగే సన్ రైజర్స్ కు మరో దెబ్బ-గాయంతో యువ ఆల్ రౌండర్ దూరం..
ఐపీఎల్ 2023లో వరుస పరాజయాలతో కింది నుంచి రెండు, మూడు స్ధానాల్లో ఉంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే కీలక ఆటగాళ్లను గాయాలతో దూరం చేసుకున్న సన్ రైజర్స్ కు ఇప్పుడు మరో ఆల్ రౌండర్ దూరమయ్యాడు. టీమ్ లో కీలక ఆటగాళ్లు విఫలమవుతున్నా కాస్తో కూస్తో రాణిస్తున్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో టోర్నీకి దూరమైనట్లు సన్ రైజర్స్ ప్రకటించింది.
వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఐదు ఇన్నింగ్స్‌లలో 60 పరుగులు చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయినా టీమ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో సన్ రైజర్స్ జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ వాషింగ్టన్‌కి గాయంతో దూరం కావడం ఇది మూడోసారి.

2021లో ఐపీఎల్ సీజన్ ప్రథమార్ధంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడు వికెట్లు తీసిన తర్వాత, వాషింగ్టన్ వేలి గాయం కారణంగా టోర్నమెంట్ యొక్క యూఏఈ లెగ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కోవిడ్ పాజిటివ్ పరీక్ష తర్వాత 2022 జనవరిలో భారత దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే లెగ్‌ను కోల్పోవలసి వచ్చింది. అయితే తొడకండరాల గాయం అతన్ని స్వదేశంలో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌కు కూడా దూరం చేసింది.
ఐపీఎల్ 2022 సమయంలో వాషింగ్టన్ సుందర్.. సన్‌రైజర్స్ కు సైనప్ చేశాక అతని బౌలింగ్ చేతిలో స్ప్లిట్ వెబ్‌బింగ్ కారణంగా నాలుగు మ్యాచ్ లకు దూరమయ్యాడు. గత ఆగస్టులో కౌంటీ స్టింట్‌లో లాంక్షైర్‌కు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సుందర్ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు తాజాగా ఈ సీజన్ లో ఐపీఎల్ లోనూ తొడ కండరాల గాయంతో దూరం కావాల్సి రావడం వాషింగ్టన్ సుందర్ కెరీర్ పై ప్రభావం చూపనుంది.












Click it and Unblock the Notifications