ఎన్నికల సంఘం నిర్వహించిన పరీక్షలో సగం మంది ప్రభుత్వాధికారులు ఫెయిల్

త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పనిచేయాల్సింది ప్రభుత్వ అధికారులే. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకంగా మారనున్న ప్రభుత్వ అధికారులకు మధ్యప్రదేశ్‌లో భారత ఎన్నికల సంఘం ఒక పరీక్ష నిర్వహించింది. ఇందులో సగానికి సగం మంది ప్రభుత్వ అధికారులు ఫెయిల్ అయ్యారు.

ఎన్నికల నిర్వహణపై పరీక్ష..సగం మంది ఫెయిల్
మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకోసం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరంతా డిప్యూటీ కలెక్టర్లు, సబ్ డివిజినల్ ఆఫీసర్, తహసీల్దార్లు ర్యాంకు ఉన్నవారే ఉంటారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా వీరిని నియమించాలని ఒక పరీక్ష నిర్వహించింది. 1000 మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారు. ఇందులో 567 మంది అధికారులు ఎన్నికల సంఘం నిర్వహించిన పరీక్షలు రాశారు. అందులో 244 మంది 70శాతానికి పైగా స్కోర్ చేయగా.. మిగతా వారంతా క్వాలిఫై కావడంలో విఫలమయ్యారు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిన అధికారులకు మరో సారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ఛీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వీఎల్ కాంతారావు చెప్పారు.
తెలంగాణకు సీఈసీ బృందం, పార్టీలకు ఇలా సమయం కేటాయింపు

రెండో ప్రయత్నంలో ఫెయిల్ అయితే చర్యలు తప్పవు
పరీక్షలో పాసైన అధికారులు నాలుగు రోజుల పాటు ట్రైనింగ్ సైతం పూర్తి చేసుకున్నారని కాంతారావు అన్నారు. రెండో ప్రయత్నంలో కూడా అధికారులు ఫెయిల్ అయితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనుంది. ఇలాంటి ఒక పరీక్షను తొలిసారిగా ఈసీ నిర్వహిస్తోంది. పరీక్షలో పాసైన వారికి ఎన్నికల సంఘం ఒక సర్టిఫికేట్‌ను కూడా ప్రధానం చేయనుంది. కొందరు ఎన్నికల విధులను తప్పించుకునేందుకే కావాలనే ఫెయిల్ అయి ఉండొచ్చుకదా అన్న ప్రశ్నకు... ఫెయిల్ అయిన వారికి జరిమానా విధిస్తామని ఎన్నికల సంఘం సమాధానం చెప్పింది. 2013లో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎన్నికల కోసం పనిచేశారో వారికి ప్రోత్సాహకంగా ఒక నెల జీతం అదనంగా ఇచ్చినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది.

వీవీపాట్‌ల పనితీరు గురించి చాలామంది అధికారులకు తెలియదు
ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ సీనియర్ అధికారులతో సమావేశం సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలా మందికి వీవీపాట్‌ల గురించి అవగాహన లేకపోవడం ఆయన్ను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా ఒక యువ కలెక్టర్ వీవీపాట్ ఎలా పనిచేస్తుందో వివరించలేకపోయారు. ఎన్నికల నిర్వహణ విధానం ప్రభుత్వ అధికారులకు తెలియకపోతే... ఎన్నికలను సరళంగా, పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు ఆర్టీఐ యాక్టివిస్ట్ అజయ్ దూబే. ఇదిలా ఉంటే తాము నిర్వహించిన పరీక్షలో అధికారులు సరైన ప్రదర్శన కనబర్చకపోయినా... వారికి అవగాహనలేకపోయినా వారిపై జరిమానా వేయడం సరికాదని అజయ్ దూబే అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని విపక్ష కాంగ్రెస్ కూడా నోరుకు పనిచెప్పింది. ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ చిన్న పరీక్షలో పాస్ కాకపోతే వారు ప్రభుత్వాన్ని పాలనాయంత్రాంగాన్ని ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వీసుల్లో వారు పనిచేసేందుకు అర్హులు కాదని కాంగ్రెస్ నేత నరేంద్ర సలుజ అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!