హెచ్1బీ కొత్త పాలసీ వాయిదా? అమెరికాకు నాస్కామ్ కీలక విజ్ఞప్తి..!
అమెరికాలో వలసవాదుల్ని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రంప్ సర్కార్ .. తాజాగా హెచ్1బీ విధానంలో కీలక మార్పులు తెచ్చింది. అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణుల నియామకం కోసం జారీ చేస్తున్న హెచ్1బీ వీసాలకు ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానం రద్దు చేసి దాని స్దానంలో జీతాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయులకు తీవ్ర నష్టం తప్పదని భారతీయ సాఫ్ట్ వేర్ సంస్ధల సమాఖ్య నాస్కామ్ హెచ్చరిస్తోంది.
హెచ్1బీ వీసాలు ఇచ్చేందుకు లాటరీ విధానం స్ధానంలో జీతాల ఆధారిత విధానం తీసుకురావడం వల్ల భారతీయులకు ఏయే విధానాలుగా నష్టం జరుగుతుందో వివరిస్తూ ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో భారతీయ స్టార్టప్ లు, నిపుణులు, ఆవిష్కరణలు, ఏఐ అభివృద్ధి ఇలా పలు రంగాలకు నష్టం తప్పదని నాస్కామ్ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

జీతాల ఆధారిత హెచ్1బీ వీసా జారీ విధానం ఆవిష్కరణలకు హాని కలిగిస్తుందని, చిన్న సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, కెరీర్ ప్రారంభ గ్రాడ్యుయేట్లకు ఇబ్బందులు కలిగించబోతోందని నాస్కామ్ తెలిపింది. హెచ్1బీ వీసాదారుల్లో 71శాతం మంది భారతీయులు అమెరికా ఏఐ AI నాయకత్వం, ఇండో-యుఎస్ భాగస్వామ్యానికి కీలకమైనవారని నాస్కామ్ గుర్తుచేసింది. తాజాగా అమెరికా కాంగ్రెస్ కు రాసిన లేఖలో ఈ మార్పుల అమలును 2028 ఆర్ధిక సంవత్సరం వరకూ వాయిదా వేయాలని , 1.6 మిలియన్ అమెరికా ఉద్యోగాలు, జీడీపీలో 198 బిలియన్ డాలర్లకు మద్దతు ఇచ్చే కార్యక్రమంలో ఈక్విటీని కాపాడాలని కోరింది.

వేతనాల ఆధారంగా జారీ చేసే హెచ్1బీ వీసాల విధానం ప్రాంతం, ఉద్యోగాన్ని బట్టి మారుతుందని, సిలికాన్ వ్యాలీ వంటి కేంద్రాల వెలుపల చిన్న సంస్ధల యజమానుల్ని విస్మరిస్తుందని నాస్కామ్ పేర్కొంది. అలాగే అమెరికా వర్సిటీ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ స్టెమ్ పాత్రలకు పరిమితం చేస్తుందని, వారి ప్రతిభను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే అంతర్జాతీయ విద్యార్థుల ఎంట్రీని అడ్డుకుంటుందని తెలిపింది. నాస్కామ్ సభ్యులు అమెరికాలోని 25 కమ్యూనిటీలలో 264,500 మందికి పైగా నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు. న్యూయార్క్ వంటి ప్రధాన టెక్ కేంద్రాలకు మించి 1.6 మిలియన్ల మద్దతు ఉన్న ఉద్యోగాలలో మూడింట రెండు వంతులు టెక్సాస్, ఒహియో వంటి రాష్ట్రాల్లో వృద్ధిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమలును 2028 ఆర్ధిక సంవత్సరం వరకూ వాయిదా వేయాలని ట్రంప్ ను కోరింది.












Click it and Unblock the Notifications