• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు' కేంద్రం కొత్త రూల్స్: ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

కారు డ్రైవింగ్

అధీకృత డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పొందితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.డ్రైవింగ్‌ లైసెన్సు కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల్లో పరీక్షలకు హాజరవ్వాల్సిన అవసరం లేదు.

అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్‌ పొందితే చాలు.

దాని ఆధారంగా టెస్టు లేకుండా డ్రైవింగ్‌ లైసెన్సు పొందవచ్చు.

ఈ విషయాన్ని కేంద్రం అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లకు శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే.. ఆర్టీయే నుంచి లైసెన్సులు పొందిన అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లు వాహనాల శిక్షణ కోసం సిమ్యులేటర్లను సమకూర్చుకోవడం.. కనీసం ఎకరా స్థలానికి తగ్గకుండా టెస్టింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్‌ స్కూల్‌లో నిర్వహించే టెస్టు వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించి, శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తారు.

వాటిని ఆర్టీయే కార్యాలయాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు దరఖాస్తుతో జతచేస్తే సరిపోతుంది. ఎలాంటి టెస్టు లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ అవుతుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

పిల్లల్లో కరోనా

థర్డ్ వేవ్‌ ప్రభావం పిల్లలపై ఉంటుందనడానికి ఆధారాలు లేవు- లాన్సెట్ అధ్యయనం

కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ నివేదిక తేల్చిచెప్పిందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

'భారతీయ పిల్లల్లో కోవిడ్‌ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్‌ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల (చిన్నపిల్లల వైద్య నిపుణులు) తో కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది.

ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది.

'కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్‌), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’ అని బృంద నివేదిక తెలిపింది.

అధ్యయన వివరాలను అనువర్తిస్తే లక్షమంది పిల్లల్లో కేవలం 500 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 2 శాతం మంది మాత్రమే మరణించడం జరిగింది. 'లక్ష మంది పిల్లల్లో కోవిడ్‌ మరణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి’ అని బృందం సభ్యుడు డాక్టర్‌ సుశీల్‌ కాబ్రా చెప్పారు.

'గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువ, మరణాల రేటు కూడా తక్కువే’ అని వివరించారు.

ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది.

అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సిజన్‌ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించిందని ఈ వార్తలో రాశారు.

కోవాగ్జిన్ సమర్థత, భద్రతపై అనుమానాలు అక్కర్లేదని భారత్ బయోటెక్ తెలిపింది

ప్రభావశీలత, భద్రతలో కోవాగ్జిన్‌కు తిరుగులేదు- భారత్ బయోటెక్

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకా శాస్త్రీయ ప్రమాణాలు, డేటా పారదర్శకంగా ఉన్నాయని భారత్‌ బయోటెక్‌ తెలిపిందని ఈనాడు పత్రిక పేర్కొంది.

ప్రభావశీలత, భద్రతలో కోవాగ్జిన్‌కు తిరుగులేదని, ఈ విషయాన్ని తొమ్మిది జర్నల్స్‌ శాస్త్రీయంగా సమీక్ష (పీర్‌-రివ్యూ) చేశాయని, ఇందులో లాన్సెట్‌, సెల్‌ప్రెస్‌ లాంటి అంతర్జాతీయ జర్నల్స్‌ ఉన్నాయని పేర్కొంది.

''టీకా సమర్థత, భద్రతపై 12 నెలల వ్యవధిలో తొమ్మిది పరిశోధన అధ్యయనాలు వెలువడ్డాయి. మా డేటా పారదర్శకం. భారత్‌లో మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసిన తొలి, ఏకైక టీకా కొవాగ్జినే. కొత్త వేరియంట్లపై ప్రభావానికి సంబంధించిన డేటా కూడా కొవాగ్జిన్‌పైనే విడుదలైంది. భారత జనాభాపై ప్రభావశీలత డేటా ఉన్న ఏకైక టీకా కూడా కొవాగ్జినే. మా నిబద్ధతను డేటా జనరేషన్‌, డేటా పారదర్శకత, అంతర్జాతీయ పరిశోధన పత్రాలే చెబుతాయి’’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

కోవాగ్జిన్‌ శాస్త్రీయ ప్రమాణాలు పారదర్శకమని, ఇందులో రాజీ ప్రసక్తే లేదని సంస్థ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎమ్‌డీ) సుచిత్ర ఎల్ల ట్వీట్‌ చేశారు.

కోవాగ్జిన్‌ ప్రి క్లినికల్‌ ట్రయల్స్‌పై 'సెల్‌ప్రెస్‌’ అధ్యయనాలను ప్రచురించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ తొలి, రెండో దశలపై 'లాన్సెట్‌- ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’ జర్నల్‌ సమగ్రంగా విశ్లేషించింది. కోవాగ్జిన్‌ సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు చూపకుండా రోగ నిరోధకతను ఇస్తుందని ప్రకటించింది.

కొత్తగా వచ్చిన వేరియంట్లను నిర్వీర్యం చేసే సామర్థ్యం కోవాగ్జిన్‌కు ఉందని ఆన్‌లైన్‌లో జీవశాస్త్రాల పరిశోధన పత్రాలను ప్రచురించే బయోఆర్‌ఎక్స్‌ఐవీ, క్లినికల్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌, ట్రావెల్‌ మెడిసన్‌ జర్నల్స్‌ పేర్కొన్నాయి.

త్వరలో కోవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్స్‌ ట్రయల్స్‌ డేటా విశ్లేషణ విడుదలవుతుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

ఈ డేటాను ముందుగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు అందిస్తామని, తర్వాత అంతర్జాతీయ శాస్త్రపరిశోధన పత్రికల్లో నిపుణుల సమీక్ష (పీర్‌-రివ్యూ) కోసం పంపిస్తామని వెల్లడించిందని ఈ కథనంలో తెలిపారు.

పులిట్జర్‌ అవార్డ్ గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ

ప్ర‌తిష్టాత్మ‌క పులిట్జర్‌ పురస్కారాన్ని భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు మేఘ రాజ‌గోపాల‌న్ ద‌క్కించుకున్నారని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.

అమెరికాలో వార్తాప‌త్రిక‌, ప‌త్రికా ఆన్‌లైన్ జ‌ర్న‌లిజం, సాహిత్యం, సంగీత కూర్పుల‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారాన్ని మేఘ రాజ‌గోపాల‌న్ మ‌రో ఇద్ద‌రితో క‌లిసి గెలుచుకున్నారు.

మేఘ రాజ‌గోపాల‌న్ ప‌రిశోధాత్మ‌క క‌థనం, అంత‌ర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

2017 లో, షిన్ జియాంగ్‌లో చైనా వేలాది మంది ముస్లింలను నిర్బంధించేందుకు డ్రాగ‌న్ ర‌హ‌స్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్బంధ శిబిరాల‌ను ఈ జ‌ర్న‌లిస్టు బ‌హిర్గతం చేశారు.

అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థ‌లో ప‌ని చేస్తున్న మేఘ రాజ‌గోపాల‌న్, అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్చెక్ త‌మ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించారు.

చైనా వీగ‌ర్ ముస్లింల హ‌క్కుల‌ను కాల‌రాస్తుందంటూ ప‌లు దేశాల్లో మైనార్టీలు ఆందోళ‌న‌లు చేశారు. మేఘ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన చైనా.. ఆమెను నిశ్శ‌బ్దంగా ఉంచేందుకు చాలా ప్ర‌య‌త్నించింది.

మేఘ వీసాను ర‌ద్దు చేసింద‌ని, ఆమెను దేశం నుంచి వెళ్లిపోవాల‌ని బెదిరించింది అని బజ్‌ఫీడ్‌ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో ఆమె వెల్లడించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'No need to test for driving license' Center New Rules: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X