వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడ బడి: ఆదివాసీ విద్యార్థులకు ఇదే ఆన్‌లైన్ పాఠం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గోడ బడి

కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలంలోని 'మొర్రిగూడ' గ్రామం కోలాం తెగ ఆదివాసీలు నివసించే కొండ మధ్యలో ఉండే ఒక గూడెం. అడవిలో ఓ మూలన విసిరేసినట్టు ఉంటుంది.

మొదటి విడత లాక్‌డౌన్ సమయం నుంచి ఈ గూడెం విద్యార్థులు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు.

సిగ్నల్, విద్యుత్ సమస్యలు ఇక్కడ డిజిటల్ తరగతులకు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.

'తిర్యాణి' ఎస్సై రామారావు చొరవతో రెండు నెలల క్రితం ఇక్కడ కొత్తగా 'గోడ బడి' ప్రారంభమైంది.

గోడ బడి

గూడెంలో నాలుగు దారులు కలిసే చౌరాస్తాలో ఓ గోడపై తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాలలు, అంకెలు రాయించి ప్రాథమిక తరగతుల పిల్లలకు గ్రామంలోని యువకులతో పాఠాలుగా చెప్పిస్తున్నారు.

బడిలో నేర్చుకున్న పాఠాలు మరిచిపోకుండా చూసేలా గోడబడి ప్రయోగం ద్వారా ప్రయత్నిస్తున్నారు.

అయితే పెద్ద తరగతుల వారికి ఆ అవకాశం కూడా లేదు. ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చదువుల కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఈ గూడెం ఒక ఉదాహరణ.

https://www.youtube.com/watch?v=q0Dhb-KL4Es

"సాధారణంగా ఆదివాసీ విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఎక్కువ. ఒక సంవత్సరం గ్యాప్ వస్తే తిరిగి స్కూల్స్, కాలేజీలకు వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చదువు మీద నుంచి వేరే విషయాలపైకి దృష్టి మళ్లకుండా ఉండేందుకే మేం ఈ ప్రయత్నం చేస్తున్నాం'' అని ఎస్సై రామారావు బీబీసీతో చెప్పారు.

తిర్యాణి మండలంలో ఆదివాసీ గూడేల దగ్గర ఇలాంటి గోడబడులు 30కి పైగా ఉన్నాయని రామారావు అన్నారు. ఆదివాసి పెద్దలు, చదువుకున్న యువకుల సహకారంతో వీటిని నడిపిస్తున్నారు.

కనీస సౌకర్యాలు కరువైన ఇక్కడి మారుమూల ప్రాంతాల్లో పిల్లలకు ఆన్‌లైన్ విద్య అందించడం తల్లిదండ్రులకు సవాల్‌గా మారింది. డిజిటల్ విద్య చాలా మందికి అందని ద్రాక్షగా మారింది.

నెట్‌వర్క్ ఇబ్బందులు, సామాజిక, ఆర్థిక కారణాల ప్రభావం వల్ల ఆదిలాబాద్ ఉట్నూర్ ఏజన్సీ ఆదివాసీ, గిరిజన విద్యార్థుల ఆన్‌లైన్ చదువులు మైదాన ప్రాంతాలతో పోలిస్తే సాఫిగా సాగడం లేదు. డిజిటల్ క్లాసులు అందరికీ అందని పరిస్థితులు ఉన్నాయి. డిజిటల్ డివైడ్ స్పష్టమైన విభజన రేఖను ఇక్కడ చూడవచ్చు.

ఆదివాసీలు

తల్లిదండ్రులకు రోజూ పరీక్షే

మొర్రిగూడేంలో ఉండే కుడిమేత భగవంత్ రావ్, కుడిమేత సంగు అన్నదమ్ములు. పోలీస్ అవ్వాలన్నది భగవంత్ రావ్ కల. పరిస్థితులు అనుకూలించక అది నెరవేరలేదు.

కూతురు విద్యను మాత్రం బాగా చదివించాలని నిర్ణయించుకున్నారాయన. ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేశారు. నిరుడు సిగ్నల్స్ అందే కొండపైకి తీసుకెళ్లి ఆన్‌లైన్ పాఠాలు సెల్‌ఫోన్‌లో వినిపించారు. ఈ ఏడాది మాత్రం సిగ్నల్స్ వచ్చే తన బంధువుల ఊరు 'బోయపల్లి గోండు గూడెం’లో ఉంచి చదివిస్తున్నారు.

"ఫస్ట్ క్లాస్‌లో కొండపైన సిగ్నల్స్ వచ్చే దగ్గరికి తీసుకుని వెళ్లి చదివించా. ఇప్పుడు రెండో తరగతి కూడా ఆన్‌లైన్‌ క్లాసులే అంటున్నారు. నా బిడ్డను గుట్ట మీద రోజూ చదివించాలంటే నా వ్యవసాయ పనులు, కిరాణా దుకాణం చూసేందుకు టైమ్ సరిపోతలేదు. సిగ్నల్స్ వచ్చే నా అత్తారిల్లు బోయపల్లిలో ఉంచి చదివిస్తున్నాను" అని కుడిమేత భగవంత్ రావ్ బీబీసీకి తెలిపారు.

మొర్రిగూడెం

భగవంత్ రావ్ తమ్ముడు 'కుడిమేత సుంగు' తన కొడుకు పార్థీవ్ ఫస్ట్ క్లాస్ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు వదులుకుని బైక్‌పై కొండెక్కి దిగుతున్నారు.

అడవి మధ్యలో సిగ్నల్స్ అందేచోటు ఒకే ఒక్కటి ఉంది. అది ఒక కొండ మీదున్న కల్వర్టు. దీంతో రోజూ కొడుకును ఆ కొండ మీదకు తీసుకెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలు వినిపిస్తున్నారు.

డిజిటల్ క్లాసులు సమయానికి అందుకునేందుకు ఆయన ఇంటిల్లిపాది తెల్లవారుజాము నుంచే ఇంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=KWzI0Q419MY

"స్కూళ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో మాకు తెలియదు సార్.. ఎన్ని రోజులు ఆన్‌లైన్‌ క్లాస్లు నడిస్తే అన్ని రోజులు మా బాబును ఇలాగే చదివించుకుంటా. మా బాబు ఫ్యూఛర్ కన్నా ఏదీ గొప్ప కాదు. సిగ్నల్ కోసం 5 కిలో మీటర్లు బైక్‌పై తీసుకెళ్తున్నా" అని బీబీసీతో చెప్పారు కుడిమేత సుంగు.

మొర్రిగూడేనికి చెందిన కుడిమేత మెంగారావుకు ఐదుగురు పిల్లలు. ఏడవ తరగతిలో ఉన్న కూతురు దీపిక చదువుల కోసం ఆయన ఆరాటపడుతున్నారు. చదువు మధ్యలో మానేసిన పెద్ద కొడుకు వ్యవసాయ పనులు చూస్తుంటే మిగతా నలుగురు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సిగ్నల్స్ రాని గూడేలలో ఇబ్బందులు పడుతున్నారు.

"ఇప్పుడు ఆన్‌లైన్‌ అంటున్నారు. మా దగ్గర సెల్‌ఫోన్లు లేవు. సెల్లు ఉన్నా సిగ్నల్ అందదు. మా గూడెంలో టీవీ ఉంది. కానీ చాలా కుటుంబాలకు డీటీహెచ్ రీఛార్జ్ చేసేందుకు పైసలు లేవు. సిగ్నల్స్ కోసం గుట్టెక్కాలంటే చాలా మంది దగ్గర మోటార్ బైకులు లేవు. 5 కిలోమీటర్లు చిన్నపిల్లలు ఎలా నడుస్తారు. మా పిల్లల లైఫ్ నాశనం అయ్యింది'' అని బీబీసీతో తన మనసులోని బాధను వెల్లబోసుకున్నారు మెంగారావ్.

భవిష్యత్తులో గణితశాస్త్ర ఉపాధ్యాయిని కావాలన్నది మెంగారావ్ కూతురు దీపిక లక్ష్యం.

దీపిక చెల్మెల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలు లేకుండా 5 నుంచి 7వ తరగతికి ప్రమోట్ అయ్యింది. గూడెంలో అనేక సమస్యల మధ్య టీ-సాట్ ఆన్‌లైన్ పాఠాలకు హాజరయ్యేందుకు విద్యుత్, నెట్‌వర్క్ కష్టాలను చవిచూస్తోంది దీపిక. టీవీలో వచ్చే ఆన్‌లైన్‌ పాఠాల వేగాన్ని అందుకోవడంలో తను ఇబ్బంది పడుతోంది.

"కరోనాతో హాస్టల్ నుంచి ఇంటికి పంపేసారు. రెండు సంవత్సరాలవుతోంది. పాస్.. పాస్.. అని అంటున్నారు. ఈ సంవత్సరం నేను 7వ తరగతి. సెల్ ఫోన్, టివీల్లో ఆన్‌లైన్‌ క్లాసుల సమయంలో తరచూ మా ఊర్లో సిగ్నల్, కరెంట్ ఇబ్బందులు వస్తున్నాయి. టీవీలో గబగబ (తొందరగా) చెబుతున్నారు. నాకేమో అది అర్థం కాదు. మా స్కూల్లో అయితే టీచర్లు మెల్లిగా జాగ్రత్తగా చెబుతారు, అక్కడైతే అర్థం అవుతుంది. స్కూళ్లు ఓపెన్ కావాలని నేను కోరుకుంటున్నాను" అని బీబీసీతో తన మనసులోమాట పంచుకుంది దీపిక.

భాష మరో సమస్య

'సహ్యాద్రి' పర్వత శ్రేణుల్లోని అవిభక్త ఆదిలాబాద్ జిల్లా అనేక ఆదిమ తెగలకు నిలయం. 'రాజ్ గోండ్', కోలాం, ప్రధాన్, తోటి, ఆంద్, మన్నేవార్ లాంటి ఆదిమ గిరిజన జాతుల జనాభా ఈ ప్రాంతంలో విస్తారంగా ఉంది.

కరోనాతో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడి ఏజన్సీ ప్రాంతంలో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్కడి వారి మాటల్లో చెప్పాలంటే రెండు మూడు దశాబ్దాల క్రితం ఇక్కడి వారు చదువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు దాదాపు అలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి వారికి.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 36వేల మంది విద్యార్థులు 134 ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఐటీడీఏ ఉట్నూర్ ఈ స్కూళ్లను పర్యవేక్షిస్తోంది.

https://www.youtube.com/watch?v=Y5OxAhIhbkg

మొదటి విడత కరోనా తగ్గుముఖం పట్టాక కొద్ది రోజులు స్కూళ్లు, హాస్టళ్లు తెరిచినా ఆ తర్వాత సెకండ్ వేవ్ ప్రభావంతో తిరిగి మూతపడ్డాయి. టీ-సాట్ ఆన్‌లైన్‌ క్లాసుల్లో తెలుగులోనే బోధిస్తున్నప్పటికీ ఆ పాఠాలు ఇక్కడి విద్యార్థులకు అర్థం కావడంలేదని ఏజన్సీ ప్రాంత ఉపాధ్యాయులు అంటున్నారు.

"ఉట్నూర్ ఆదివాసీ ప్రాంతంలో ఎక్కువగా గోండ్ భాషలో మాట్లాడతారు. డిజిటల్ క్లాసులు తెలుగులో చెబుతున్నారు. మా పిల్లలకు తెలుగు మీడియం పాఠాలను వారి మాతృభాష సహాయంతో అర్థం చేయించాల్సి ఉంటుంది. ఎక్కడో ఉండి చెప్పే డిజిటల్ క్లాసులలో ఇది కుదరని పని. అందువల్ల ఈ పాఠాలు మా పిల్లల మైండ్‌కు ఎక్కడం లేదు" అని జైనూర్ మండలం పోచంలొద్ది గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సీతారాం బీబీసీతో చెప్పారు.

ఏజన్సీ ప్రాంత తల్లిదండ్రుల్లో డిజిటల్ నిరక్షరాస్యత ఎక్కువ. పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులకు సహకారం అందించలేని పరిస్థితి వారిది. కొండకోనల భౌగోళిక పరిస్థితుల్లో కేబుల్ టీవీ నెట్‌వర్క్ ఈ ప్రాంతంలో తక్కువ. టీవీ ప్రసారాలకు ఎక్కువగా డీటీహెచ్ సర్వీస్‌లపై ఆధారపడుతున్నారు. గూడెంలో ఒకటో రెండో ఇళ్లకు మాత్రమే టీవీలు ఉన్నాయి. అవికూడా లేని గూడాలు కూడా ఉన్నాయి. డీటీహె‌చ్‌లకు రీఛార్జ్ చేయకపోవడంతో చాలాచోట్ల టీవీలు పనిచేయడం లేదు.

విద్యుత్, నెట్‌వర్క్ సమస్యలే ప్రధానం

ఉట్నూర్ మండలం 'ధర్మాజీపేట' సంపూర్ణంగా సోలార్ విద్యుత్‌పై ఆధారపడిన గ్రామం.

మారుమూల అటవీప్రాంతంలో ఉండటంతో ప్రభుత్వ విద్యుత్ లైన్లు ఇక్కడికి ఇంకా చేరలేదు.

కరెంట్ వెలుగులు అంటే తెలియని ఈ గూడెంలో రెండేళ్ల క్రితం ఉట్నూర్ ఐటీడీఏ అధికారులు సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసారు. నిర్వహణ లోపంతో ప్రస్తుతం అది రిపేర్‌లో ఉంది. అధికారులు దానిగురించి పట్టించుకోలేదు.

రోజుకు రెండు గంటలకు మించి విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. అది ఇక్కడి గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఈ గూడెంలోని పిల్లలు విద్యుత్ సౌకర్యం లేక ఆన్‌లైన్‌ క్లాసులు వినలేకపోతున్నారు.

"మా గూడెంలో 'సోలార్' రెండు సంవత్సరాల వరకు పనిచేసింది. ఇప్పుడు బ్యాటరీలు డెడ్ అయ్యాయి, రెండు మూడు గంటలకు మించి కరెంట్ రాదు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం డీటీహెచ్ రీఛార్జ్ చేసినా టీవీ నడవాలంటే కరెంట్ ఉండాలి కదా! ఛార్జింగ్ అయిన విద్యుత్‌తో టీవీ నడిపిస్తే, రాత్రి పూట అవసరాలకు ఇబ్బంది అని టీవీ యజమాని దాన్ని కట్టేస్తాడు. దీంతో పిల్లలు ఆటపాటలకే పరిమితం అవుతున్నారు. చదువుల్లేవు ఏమీ లేవు'' అని టేకం శారద బీబీసీతో అన్నారు.

https://www.youtube.com/watch?v=U4pFvdqVUZU

సెల్‌ఫోన్‌లున్న విద్యార్థుల చదువుల తీరును వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉపాధ్యాయులు అక్కడక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇలా పరోక్ష పర్యవేక్షణలో ఉన్న విద్యార్థుల శాతం మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే తక్కువగా ఉంది. ఖరీఫ్ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చాలా మంది పిల్లలు పొలం పనుల్లో, పశుపోషణ వైపు మళ్లుతున్నారు. ఈమధ్య ఉట్నూర్ ఐటీడీఏ చేసిన ఓ సర్వేలో 35శాతం మంది విద్యార్థులకు సెల్‌ఫోన్లు, 25 శాతం మందికి టీవీలు లేవని తేలింది.

"మా పిల్లలకు కంప్యూటర్ చదువులపై అంతగా అవగాహన లేదు. దీని ప్రభావం మా పిల్లల చదువులపై పడింది. డ్రాప్ అవుట్స్‌తో చైల్డ్ లేబర్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాగే ఉంటే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తారు" అని కాత్లే పర్బత్ రావ్ బీబీసీతో చెప్పారు.

కోలాం ఆదివాసీ తెగకు చెందిన ఆయన సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివారు.

"మేము చదువుకున్న కాలంతో పోలిస్తే ఇప్పుడు విద్య అవకాశాలు, రోడ్డు వ్యవస్థ మెరుగయ్యాయి. హాస్టళ్ల సంఖ్యా పెరిగింది. కానీ, కరోనాతో మా పిల్లల చదువులు మొదటికొచ్చాయని పర్భత్ రావ్ అన్నారు.

రంగంలోకి ఉట్నూర్ ఐటీడీఏ

ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక వర్క్ బుక్ కిట్లను రూపొందించింది. త్వరలో పోస్టల్ శాఖ సహకారంతో వారి ఇళ్లకు పంపేఏర్పాటు చేస్తోంది.

డిజిటల్ క్లాసుల వినడంలో సమస్యలు ఉన్న వారికి ఈ కిట్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. మరోవైపు ప్రత్యక్ష చదువులకు దూరం అవడంతో ఇక్కడి విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం రక్తహీనతకు దారితీస్తోంది.

ముఖ్యంగా కౌమారదశలో ఉన్న ఏజన్సీ ప్రాంత బాలికల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కోవిడ్‌కు ముందు స్కూళ్లు, హాస్టళ్లలో గుడ్లు, కూరగాయలు, మాంసంతో ఆహారం పిల్లలకు పెట్టేవారు.

'ట్రైబల్ ఏరియాలో న్యూట్రీషన్ సమస్య కొంత ఉంది. సీఎం కూడా దీనిపై సూచనలు చేసారు. గిరిజన సంక్షేమ శాఖనుంచి ఆదివాసీ గ్రామాల్లో త్వరలో గిరిపోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ప్రారంభించి పౌష్టికాహారం అందే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఐటీడీఐ పీఓ భవేశ్ మిశ్రా బీబీసీతో చెప్పారు.

'మేము పంపే వర్క్ బుక్‌లు విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించాం. ఇంట్లోనే ఉండి వారు దాన్ని నింపుతారు. గ్రామాల్లో విద్యార్థులకు సహాయంగా వాలంటీర్లను నియమిస్తాం" అని భవేశ్ మిశ్రా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
online lessons for tribal people on school wall
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X