
మూడో రోజుకు ఆపరేషన్: పాక్‌కు భారత్ అల్టిమేటం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ ఆపరేషన్ మూడో రోజుకు చేరుకుంది. ఎయిర్ బేస్‌లో నక్కి దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య సోమవారం ఉదయం కూడా కాల్పుల కలకలం సృష్టించింది. అయితే ఈ ఆపరేషన్‌ను రహస్యంగా నిర్వహిస్తున్నారు.
ఎయిర్ బేస్‌లో చొరబడ్డ జైషే అహ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాలకు పెను సవాళ్లు విసురుతున్నారు. మూడు రోజులుగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయినా, మిగిలిన ఒకరిద్దరు పెను విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు ఆదివారం రాత్రి మట్టుపెట్టాయి. స్థావరంలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించి ఉగ్రవాదిని హతమార్చాయి. తాజాగా సోమవారం ఎయిర్ బేస్‌లో మరో భారీ పేలుడు సంభవించింది.
వెనువెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఉగ్రవాదులపై కాల్పులను ప్రారంభించాయి. అటు వైపు నుంచి కూడా ఉగ్రవాదులు తుపాకులు పేలుస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ చర్చల కార్యక్రమం ముందుకెళ్లడం అనుమానంగానే మారింది. భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య వరుస భేటీల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం భారత్- పాక్ విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశం జనవరి 14,15 తేదీలలో జరగాల్సి ఉంది.
ఈ సమావేశంలో చర్చలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపకల్పన కోసం ఇరు దేశాల అధికారులు నేడు భేటీ కానున్నారు. అయితే పఠాన్ కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన జైషే అహ్మాద్‌కు చెందిన వారేనని నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో చర్చలు డైలమాలో పడ్డాయి.
దీంతో జైషే అహ్మాద్ ఉగ్రవాద సంస్థపై 72 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, పాక్‌ను కోరనుంది. జైషేపై తీసుకోబోయే కఠిన చర్యలపైనే 15న జరగనున్న విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ ఆధారపడి ఉంటుందని కూడా భారత వర్గాలు తేల్చిచెప్పనున్నాయి.
ఈ మేరకు పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో భారత్ ఉంది. జైషేపై చర్యలకు పాక్ వెనుకాడితే, భవిష్యత్ చర్చలు కూడా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాక్ తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి.