Rahul Gandhi : దానిష్ అలీ ఇంటికెళ్లి హత్తుకున్న రాహుల్- విద్వేష అంగడిలో మరో ప్రేమ దుకాణం..
నిన్న లోక్ సభలో చంద్రయాన్ 3 సక్సెస్ పై అంతా చర్చిస్తున్న వేళ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ముస్లిం ఎంపీ దానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. అంతా చూస్తుండగానే దానిష్ ను తీవ్రవాది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన సొంత పార్టీ బీజేపీ సైతం ఇరుకునపడింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అయితే రమేష్ పై తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సొంత పార్టీ బీజేపీ ఇవాళ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా పంపింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేతిలో అవమానానికి గురైన బీఎస్పీ ఎంపీ దానిష్ అలీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హీతో కలిసి ఢిల్లీలోని బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ ఇంటికి వెళ్లి రాహుల్.. ఆయన్ను హత్తుకున్నారు. దానిష్ అలీకి అండగా నిలుస్తామని ప్రకటించారు. రమేష్ బిధూరీ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవద్దన్నారు.

రాహుల్ గాంధీ తన ఇంటికి రావడంతో దానిష్ అలీ సైతం ఉబ్బితబ్బిబయ్యారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతల్ని ఇంట్లోకి ఆహ్వానించారు. రాహుల్ తనకు అండగా నిలవడంపై దానిష్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, తన ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని చెప్పారని భేటీ అనంతరం దానిష్ అలీ వెల్లడించారు. రాహుల్ వ్యాఖ్యలతో తనకు ఒంటరి భావన పోయిందని, చాలా ఊరటగా అనిపించిందని తెలిపారు.


మరోవైపు రాహుల్ గాంధీ కూడా బీఎస్పీ ఎంపీ దానిష్ అలీతో భేటీ తర్వాత స్పందించారు. విద్వేష అంగడిలో ప్రేమ దుకాణం తెరిచానంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ పర్యటన ఫొటోల్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. రమేష్ బిధూరి అవమానకరమైన , చిల్లర చర్య సభ గౌరవానికి మచ్చ అని తెలిపింది. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇటువంటి ద్వేషం, ద్వేషపూరిత మనస్తత్వానికి తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని పేర్కొంది.












Click it and Unblock the Notifications