ఉచితబస్సు హామీతో గెలిచాడు, ట్రంప్ కి షాకిచ్చాడు.. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మనోడు!
అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లిక్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. స్థానిక ఎన్నికలలో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగరం మేయర్ పదవిని డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ సొంతం చేసుకున్నారు. నగర మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ ఎంపికయ్యారు. ఇది డెమొక్రటిక్ పార్టీకి సంబంధించి కీలక విజయంగా పరిగణించబడుతుంది.
జోహ్రాన్ మమ్దానీ ఓటమి కోసం రంగంలోకి ట్రంప్
ఈ ఎన్నికలలో జోహ్రాన్ మమ్దానీ మాజీ గవర్నర్ ఆండ్రు క్యూమో, రిపబ్లికన్ కర్టిస్ట్ స్లివా ఇద్దరిని ఓడించారు. భారతీయ ఉగాండా మూలాలు ఉన్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు అంటే ఈ స్థానిక ఎన్నిక డోనాల్డ్ ట్రంప్ కు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు అతడిని గెలిపించ వద్దని ట్రంప్ పోస్ట్ చేశారు.

ట్రంప్ కు షాకిచ్చిన న్యూయార్క్ నగరవాసులు
ఒకవేళ జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే కనీస అవసరాలకు సరిపడిన స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని, న్యూయార్క్ నగరానికి భారీగా నిధుల కేటాయింపు జరగదు అని అర్థం వచ్చేలా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినప్పటికీ న్యూయార్క్ ప్రజలు అతనికి పట్టం కట్టి ట్రంప్ కు షాక్ ఇచ్చారు. అతిపిన్న వయసులోనే న్యూయార్క్ మేయర్ గా ఎంపికైన వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించారు.
భారతీయ సంతతికి చెందిన ముస్లిం మేయర్
న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరానాయర్ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమ్మద్ మమ్దానీ, మీరాల సంతానమే జోహ్రాన్ మమ్దానీ. సోషలిస్ట్ భావజాలం ఉన్న అతడు, ప్రస్తుతం భారత్ అంటేనే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్న ట్రంప్ ని ఢీకొట్టి నిలిచిన భారతీయ సంతతికి చెందిన ముస్లిం మేయర్. ప్రస్తుతం ఇది అమెరికాలో మాత్రమే కాదు ఇండియాలో కూడా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
ఉచిత బస్సు హామీతో గెలిచిన న్యూయార్క్ మేయర్ మనవాడే
న్యూయార్క్ మేయర్ గా గెలిచిన ఆయన ప్రజా సంక్షేమం కోసం అందిస్తామని చెప్పిన హామీలే ఆయనను నిలబెట్టింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉచిత సిటీ బస్సు ప్రయాణాల హామీని, నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ట్రంప్ ని ఎదిరించే ధైర్యం ఆయనకు ప్లస్
2030 నాటికి కనీస వేతనాలను పెంపు చేస్తామని చిరు వ్యాపారుల జీవన వ్యయాలను తగ్గించి, కార్పొరేట్ల పైన, సంపన్నుల పైన పన్నులు పెంచుతామని పేర్కొన్నారు. ఇక ఈ హామీలే నగర ప్రజలను ఆకట్టుకోగా, అన్నింటికంటే ట్రంప్ ని ఎదిరించే ధైర్యం జనాలకు బాగా నచ్చి న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీకి పట్టం కట్టారు.












Click it and Unblock the Notifications