వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బంగారం

ప్రపంచవ్యాప్తంగా హిందువులు దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగకు 2,500 సంవత్సరాల కంటే పైబడిన చరిత్ర ఉందని చెబుతారు. భారతదేశంలో దీపావళి పండుగను అయిదు రోజుల పాటు జరుపుకుంటారు. లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తూ బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు.

భారతదేశంలో పెళ్లిళ్ల సీజనులో బంగారానికి బాగా గిరాకీ పెరిగినట్టే, దీపావళి సమయంలో కూడా గిరాకీ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బంగారం మార్కెట్లల్లో భారతదేశం కూడా ఒకటి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) 2017లో మొత్తం భారతీయ బంగారానికి ఉన్న డిమాండ్ 727 టన్నులుగా అంచనా వేసింది.

నేడు, చాలామంది భారతీయులు బంగారం కొనుగోళ్ల కోసం మార్కెట్లకు తరలివస్తుండగా, యువకులు మాత్రం 'డిజిటల్ గోల్డ్' వైపు ఆకర్షితులవుతున్నారని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

బంగారం

డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?

డిజిటల్ బంగారం అంటే బంగారాన్ని భౌతికంగా కొనుగోలు చేయకుండా, వర్చువల్ పద్ధతిలో కొనుగోలు చేయడం. దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తారు. కొన్న బంగారాన్ని అమ్మకపుదారుడు కొనుగోలుదారుని పేరిట ఒక ఖతాలో భద్రపరుస్తాడు.

అయితే, డిజిటల్ బంగారం మీద కూడా 3 శాతం జీఎస్టీ ఉంటుంది. స్వచ్ఛత, నాణ్యత కోసం దీన్ని 24 క్యారెట్ల రూపంలోనే అమ్ముతారు.

డిజిటల్ గోల్డ్‌లో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు?

కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి డిజిటల్ బంగారంపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది.

న్యూదిల్లీకి చెందిన కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ 'యాక్సిస్ మై ఇండియా' ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. 5300 మంది వ్యక్తులపై జరిపిన ఈ సర్వేలో, భారతదేశంలో 15 శాతం యువత (18-24 ఏళ్ల వారు) డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తేలింది.

'ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ బిహేవియర్' పేరుతో రూపొందించిన ఈ అధ్యయనంలో డిజిటల్ బంగారంతో పాటు వివిధ పెట్టుబడి సాధనాల ఆధారంగా వినియోగదారుల ప్రవర్తనను అంచనా వేశారు.

బంగారం

భౌతికరూపంలో బంగారానికి తగ్గని గిరాకీ

ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నవారిలో పురుషులు అధికంగా ఉన్నారని యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలింది. మొత్తం పెట్టుబడిదారుల్లో 55 శాతం పురుషులే ఉన్నారు. అయితే పండుగ దినాల్లో మహిళలే ఎక్కువగా బంగారు ఆభరణాలు కొంటారని ఈ అధ్యయనం తెలిపింది.

ఈ నేపథ్యంలో, మహిళలను డిజిటల్ బంగారం వైపు ఆకర్షించడానికి ఒక డిజిటల్ గోల్డ్ కంపెనీ ఓ సరికొత్త స్కీంతో ముందుకు వచ్చింది. అదేంటంటే, నగల వ్యాపారులకు తమ బంగారాన్ని లీజుకు ఇచ్చే వీలు కల్పించడం.

సేఫ్‌గోల్డ్ అనే భారతీయ కంపెనీ డిజిటల్‌గా తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అవకాశం కల్పిస్తోంది.

డిజిటల్ బంగారాన్ని లీజుకు ఇవ్వడం వల్ల కస్టమర్‌లకు రిస్క్ ఉంటుంది కానీ, అధిక రాబడి కూడా ఉంటుందని ఈ కంపెనీ సీఈఓ గౌరవ్ మాథుర్ అంటున్నారు.

"లీజుకు ఇవ్వడం ద్వారా మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మేం మీ బంగారాన్ని లీజుకు తీసుకునే నగల వ్యాపారుల జాబితా అందిస్తాం. ఇది పూర్తిగా కొనుగోలుదారుల నిర్ణయమే. కానీ, లీజుకి ఇస్తే 5 నుంచి 6 శాతం లాభాలు రావచ్చు. ఈ స్కీం బాగా పనిచేస్తోంది. డిజిటల్ బంగారం కొన్నవారు దాన్ని తమ ఖాతాలో భద్రంగా ఉంచుతారు. అదలా ఉంటుంది తప్పితే, దానిపై మరే రాబడీ ఉండదు. కానీ, లీజుకి ఇస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది" అని ఆయన వివరించారు.

"భారతదేశంలో ప్రతి ఏడాది సుమారుగా 800-1000 టన్నుల బంగారానికి డిమాండ్ ఉంటుంది. నేటి కాలంలో జనం తక్కువ విలువ గల బంగారాలు కొని, తరచూ మారుస్తుండడం కంటే, అధిక విలువ గల బంగారాన్ని కొని, ఎక్కువకాలం భద్రపరుచుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. దీర్ఘకాలం తరువాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు లేదా లాభాల కోసం లీజుకి ఇస్తున్నారు. ఇది ఎక్కువమంది మహిళలను ఆకర్షిస్తోంది" అని మాథుర్ చెప్పారు.

అయితే, మాథుర్‌కు డిజిటల్ గోల్డ్ వ్యాపారం మొదలెట్టడానికి ప్రేరణ ఏమిటి?

"భారతదేశంలో బంగారానికి చాలా పెద్ద మార్కెట్ ఉంది. అందులో 80 శాతం అసంఘటితంగా ఉంది. పెద్ద పెద్ద, వ్యవస్థీకృతమైన రిటైల్ చెయిన్స్ మొత్తం విలువలో 20 శాతం వరకు ఉంటాయి. సాధారణంగా బంగారం పరిశ్రమ పన్నులు కట్టని నగదు చెల్లింపుల ద్వారా జరుగుతుంది. టెక్నాలజీ పెరుగుతుండడంతో, ఈ వ్యాపారాన్ని సంఘటితం చేసి, ఆన్‌లైన్‌కు తీసుకువస్తే బాగుంటుందనిపించింది. అందుకే దీన్ని ప్రారంభించాను" అని మాథుర్ చెప్పారు.

డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడంలో లాభాలు, నష్టాలు?

2019లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా భారతీయుల ఇళ్లలో దాదాపు 25,000 టన్నులు బంగారం నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో చైనా తరువాత భారతదేశంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ ఉంది.

డిజిటల్ బంగారం కొనడంలో ఉన్న అతిపెద్ద లాభం సురక్షితమైన నిల్వలు. దీన్ని బీమా చేసిన, సురక్షితమైన బ్యాంకులలో నిల్వ చేస్తామని అమ్మకపుదారులు చెబుతున్నారు. దీనికి ఎటువంటి అదనపు ఖర్చు ఉండదు. అద్దె చెల్లించే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి దీనిలో మోసపూరిత అమ్మకాలకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆయితే ఇలాంటి సురక్షితమైన నిల్వలు శాశ్వతంగా ఉండవు. దీనికి కాల పరిమితి ఉండవచ్చు.

డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లలో ఉన్న సౌలభ్యంతోపాటు, దీన్ని చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కోగలిగే వెసులుబాటు ఉండడం కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. 0.1 గ్రాముల బంగారం కూడా కొనవచ్చు. క్రమంగా మీ నిల్వలను పెంచుకుంటూ పోవచ్చు. భౌతిక రూపంలో బంగారాన్ని ఇంత చిన్న మొత్తంలో కొనుక్కోవడం ఆర్థికంగా లాభం కాదు. కానీ, డిజిటల్ బంగారాన్ని ఎంత చిన్న మొత్తంలోనైనా కొనుగోలు చేయవచ్చు.

డిజిటల్ బంగారాన్ని రియల్ టైమ్ మార్కెట్ ధర వద్ద ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మీరు దీన్ని అమ్మకూడదు అనుకుంటే, బంగారు నాణాలుగా మార్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

అయితే, దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

బంగారం

రెగ్యులేషన్ లేదు

డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడంలో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే, దీనిపై నియంత్రణ పర్యవేక్షణ లేదు. డిజిటల్ బంగారం లావాదేవీలపై నిఘా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థ లేదు.

"డిజిటల్ గోల్డ్‌కు కూడా రెగ్యులేషన్ ఉండాలని కోరుతూ మేం ఎన్నో ఫైనాన్షియల్ రెగ్యులేటర్లకు పత్రాలు సమర్పించాం. కేంద్ర ఆర్థిక శాఖకు కూడా పత్రాలు సమర్పించాం. ఈ పరిశ్రమ ఎదగాలంటే రెగ్యులేషన్ తప్పనిసరిగా ఉండాలి. మనదేశం దిగుమతి చేసుకునే పెద్ద వస్తువుల్లో బంగారం ఒకటి. దీనికి రెగ్యులేషన్ ఉండడం అవసరం. అలాగే, పన్నులు ఎగ్గొట్టే విధంగా నగదు చెల్లింపులు ఎక్కువగా జరుగుతాయి. దీన్ని అరికట్టడానికీ రెగ్యులేషన్ కావాలి" అని మాథుర్ అంటున్నారు.

"ఎంత ఎక్కువమంది డిజిటల్ గోల్డ్ కొంటే, ఈ రంగం అంత శుభ్రపడుతుంది. మేం అందిస్తున్నట్టుగా లీజుకి ఇచ్చే స్కీం ఉంటే బంగరం దిగుమతులు కూడా తగ్గుతాయి. ఇది దేశానికి లాభదాయకం. వ్యవస్థలో ఉన్న బంగారాన్నే మళ్లీ లీజుకు తిప్పుతాం కాబట్టి, దిగుమతులు తగ్గుతాయి. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ మార్కెట్ కేవలం 5 శాతం ఉంది. డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ 10 శాతం మించి పెరిగితే, అప్పుడు రెగ్యులేటర్లు దీనిపై దృష్టి పెడతారు" అని మాథుర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి, కొనుగోలుదారులకు ఇచ్చే డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్లకు భౌతిక రూపంలో బంగారం బ్యాకప్ ఉందో లేదో తనిఖీ చేసే అధికారిక పద్ధతి లేదు.

డిజిటల్ బంగారం లాంటి పరిశ్రమలలో పెట్టుబడిదారులకు రక్షణ లేదన్న ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, క్రిప్టో ఆస్తులతో పాటు డిజిటల్ బంగారాన్ని కూడా నియంత్రణ పర్యవేక్షణలోకి తీసుకురావడానికి కేంద్ర ఆర్థిక శాఖ, సెబీ, ఆర్బీఐ కృషి చేస్తున్నాయని 2021లో హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌కు భౌతిక వస్తువుల మద్దతు ఉండడం ముఖ్యమని, మొత్తం లావాదేవీలు కాగితంపై మాత్రమే జరిగితే పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

భారతదేశంలోని సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం 1956లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం, డిజిటల్ బంగారం సెక్యూరిటీల కిందకు రాదు. 2021 ఆగస్టులో డిజిటల్ బంగారం అమ్మకాలను నిలిపివేయమని ఎక్స్ఛేంజీలు స్టాక్ బ్రోకర్లను కోరాయి. ఆ మేరకు స్టాక్ బ్రోకర్లు డిజిటల్ బంగారం అమ్మకాలను నిలిపివేసినప్పటికీ, మొబైల్ వాలెట్లు, పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లు అలానే కొనసాగుతున్నాయి.

బంగారం

ఆభరణాలుగా మార్చాలంటే అదనపు ఖర్చు అవుతుంది

డిజిటల్ గోల్డ్‌ను ఆభరణాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ధరలు సరితూగకపోవచ్చు. డిజిటల్ బంగారం ధరలు ఎల్లప్పుడూ ఆభరణాల ధరల కంటే తక్కువగా ఉంటాయి.

అలాగే మార్చుకునే సమయంలో వినియోగదారులు పన్నుల పరంగా అదనపు మొత్తం చెల్లించవలసి ఉంటుంది. రెండుసార్లు జీఎస్టీ పడవచ్చు. మొదట, డిజిటల్ బంగారాన్ని వినియోగదారుడికి విక్రయించినప్పుడు, రెండవసారి, పూర్తయిన ఆభరణాల తుది విలువపై టాక్స్ పడవచ్చు.

ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రతి గ్రాము డిజిటల్ బంగారాన్ని సురక్షితమైన ఖతాలో ఉంచుతామని అమ్మకపుదారులు వాగ్దానం చేస్తున్నప్పటికీ, వినియోగదారులకు తమ బంగారం నిల్వ ఉందో, లేదో తనిఖీ చేసే మార్గం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is Digital Gold? Why does it increase in demand during Diwali?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X