వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పెండింగ్ బిల్లుల కోసం అక్టోబర్ నెలలో విజయవాడలో కాంట్రాక్టర్ల ధర్నా

> ఎన్ఆర్జీఎస్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి- ఏపీ హైకోర్టు ఆదేశం

> బిల్లులు చెల్లించకపోతే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం- విజయవాడ ధర్నాచౌక్ లో కాంట్రాక్టర్ల నిరసన

> నాడు పోషకులం- నేడు యాచకులం- అమలాపురం మునిసిపల్ ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ప్రదర్శన

> ప్రభుత్వ టెండర్లకు మొఖం చాటేసిన కాంట్రాక్టర్లు

> కాంట్రాక్టర్లు రాకపోవడంతో రీటెండర్లకు ప్రయత్నాలు

> బిల్లులు చెల్లించే వరకూ టెండర్లు వేయబోమంటున్న కాంట్రాక్టర్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అనేక చోట్ల కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొత్తగా పిలుస్తున్న టెండర్లలో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నారు.

అయితే, ప్రభుత్వ నిర్లక్ష వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుండగా, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులను కూడా తామే చెల్లించాల్సి వస్తోందని, ప్రాధాన్య క్రమంలో చెల్లించుకుంటూ వస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

కాంట్రాక్టర్ల కష్టాలు

రూ. 60,0000 కోట్లు దాటిన పెండింగ్ బిల్లులు

సహజంగా ప్రభుత్వ శాఖల్లో ఏదైనా ఓ పనికి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతారు. పనుల స్థాయిని బట్టి కాంట్రాక్టర్లు కూడా క్లాస్ వన్ నుంచి వివిధ స్థాయిల్లో అందుకు పోటీ పడుతూ ఉంటారు.

కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవల రోడ్ల పనుల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే రాయలసీమలో మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దాంతో మళ్లీమళ్లీ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది.

''అన్ని శాఖల్లోనూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. మూడు, నాలుగేళ్లుగా బిల్లులు నిలిచిపోయాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. పెండింగు బిల్లులే రూ. 60 వేల కోట్లు దాటిపోయాయి. కొన్ని బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం పెండింగులో పెట్టేసింది. వాటిని చెల్లించడానికి ఈ ప్రభుత్వం ససేమీరా అంటూ కాలయాపన చేస్తోంది’’ అని క్లాస్ వన్ కాంట్రాక్టర్ కొండేటి మహేశ్వర రావు బీబీసీ ముందు వాపోయారు

బిల్లులు చెల్లించకపోవడానికి రాజకీయ కారణాలు కొన్నయితే, ఆర్థిక పరిస్థితి మరో కారణమని ఆయన చెబుతున్నారు. ''గతంలో ఇలా ఎన్నడూ లేదు. బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగులో పెడితే మా పరిస్థితి ఏమిటి. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన వారు ఏం కావాలి’’ అని మహేశ్వర రావు ప్రశ్నించారు.

ఆత్మహత్యలు వద్దంటూ హైకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది...

బిల్స్ వస్తుంటే డబ్బు రొటేషన్ అవుతుందని, లేదంటే ఇబ్బందులు తప్పవని కాంట్రాక్టర్లు అంటున్నారు.

''మా జేబుల నుంచి ఖర్చు చేసేశాం. బిల్లులు వస్తే కొంత అప్పులు తీర్చి, కొంత సిబ్బందికి చెల్లించి, మా జీవితాలు నెట్టుకొస్తాం. అయినా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. చివరకు పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు చనిపోయారు. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు’’ అని అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ హనుమాన్ ప్రసాద్ అన్నారు.

ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టుకి వెళితే ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి కూడా తాము న్యాయం చేస్తామని, ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాల్సి వచ్చింది ప్రసాద్ గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయంలో చేసిన గ్రామీణాభివృద్ధి శాఖలోని ఉపాధి హామి పథకం బిల్లులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దాంతో కాంట్రాక్టర్ అసోసియేషన్ తరుపున కోర్టులో పిటీషన్లు వేశారు. కానీ నేటికీ ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయని పిటీషనర్లు వాపోతున్నారు.

నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బి, మునిసిపల్ ఇలా దాదాపు అన్ని ప్రధాన శాఖల్లోనూ బిల్లులు ఎక్కువగా బకాయిలున్నాయి. వాటిని చెల్లించకుండా కొత్త పనులు చేయలేమని కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు.

అమరావతి ప్రాంతంలోని హైకోర్టు విస్తరణ పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు మొగ్గుచూపలేదని హనుమాన్ ప్రసాద్ తెలిపారు. రూ. 29.14 కోట్ల పనులకు పెద్దగా స్పందన రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

బిల్లులు వస్తేనే మా బతుకులు

ఒకప్పుడు అడ్వాన్సులు చెల్లించే నిబంధనలు ఉండేవని, ఇప్పుడు అందులో మార్పులు వచ్చాయని, అందుకే సమస్య వస్తోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

''ఇప్పుడు మొత్తం పనులు చేసినా పేమెంట్ జరగడం లేదు. ఇందులో 14,15 ఆర్థిక సంఘాల నిధులు వచ్చినా బిల్లులు మాత్రం కాంట్రాక్టర్లకు చెల్లించలేదు. సీఎఫ్ఎంఎస్ కి పంపించామని అధికారులు చెబుతారు. అక్కడ మాత్రం ప్రభుత్వం క్లియర్ చేయడం లేదు. అక్కడ నిధులు వేస్తేనే మాకు వస్తాయి. ఇలా ఏళ్ల తరబడి ఆపేస్తే ఇక మేము బతికేదెలా’’ అని అమలాపురానికి చెందిన అల్లాడ వెంకట రమణ అనే కాంట్రాక్టర్ అన్నారు.

''20 ఏళ్లుగా పనులు చేయిస్తున్నాను గానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆ బిల్లులు వస్తేనే బతుకులు లేదంటే పూర్తిగా చితికిపోవాల్సిందే. ఒక్క అమలాపురం మునిసిపాలిటీలోనే రూ. 4 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి’’ అని ఆయన వాపోయారు.

తనకు డ్రైన్లు, రోడ్లు వేసిన బిల్లులు రూ. 20లక్షలు రావాల్సి ఉండగా ఏడాది దాటినా వచ్చేలా కనిపించడం లేదని ఆయన బీబీసీతో అన్నారు.

మాకు కూడా పనిలేకుండా పోయింది...

ఆంధ్రప్రదేశ్ లో చిన్నా, పెద్దా కాంట్రాక్టర్లంతా కలిపి సుమారు 8వేల మంది ఉంటారు. అందులో కాస్త పెద్ద కాంట్రాక్టర్లు, ఎక్కువ కాలంగా పనులు చేయిస్తున్న వారి సంఖ్య పదో వంతు ఉంటుంది.

ఈ పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర కూలీలు, గుమస్తాలు సహా వివిధ స్థాయిలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పనులు నిలిచిపోవడం, పాత బిల్లులే చేతికి రాకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు సిబ్బందిని తొలగించడమో, లేక తాత్కాలికంగా తగ్గించడమో చేస్తున్నారు. దాని మూలంగా ఉపాధి మీద ప్రభావం పడుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

''ఐదారేళ్ల కిందటి వరకూ సజావుగా సాగింది. మూడేళ్ళ కిందటి నుంచి బిల్లుల పెండింగ్ మొదలయ్యింది. రెండున్నరేళ్లుగా బిల్లులే రాకపోవడంతో మా కాంట్రాక్టర్ చిట్టిబాబు, తన వద్ద పనిచేసే సిబ్బందిని ఇంటికి పంపేశారు’’ అని బీబీసతో అన్నారు విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు.

ఆర్ అండ్ బీలో పలు పనులు చేసిన కాంట్రాక్టర్ చిట్టిబాబుకి కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణం

ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఆర్ధిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి, ఇప్పుడు చెల్లింపుల దగ్గర ఆపుతున్నారని, దీనివల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాక అభివృద్ధి పనులు నిలిచిపోతాయని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు.

''రోడ్లు దయనీయంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు పనిచేసేందుకు ముందుకు రాకపోతే మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిల మీద దృష్టి పెట్టాలి. టీడీపీ హయంలో పనులు చేసిన వారిని వేధించే రీతిలో బిల్లులు తిప్పి పంపించడం తగదు’’ అని చినరాజప్ప వ్యాఖ్యానించారు.

జగన్ ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం చేతగాకపోవడం వల్ల రాష్ట్రానికి చిక్కులు వస్తున్నాయని ఆయన బీబీసీతో అన్నారు

బుగ్గన

గత ప్రభుత్వం పెట్టిన పెండింగులే కారణం..

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగులో ఉన్న మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరిస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో వాటిని చెల్లిస్తున్నట్టు చెబుతోంది.

పెండింగులో ఉన్న బకాయిల బిల్లుల వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆర్థిక శాఖ అధికారులు సిద్ధం కాలేదు. పూర్తి సమాచారం లేదంటూ బీబీసీకి తెలిపారు.

''మా ప్రభుత్వం వచ్చే నాటికి రూ. 60వేల కోట్లు పెండింగులో పెట్టారు. బకాయిలను ఈ ప్రభుత్వానికి అప్పగించారు. ఆర్థిక లోటు, అప్పులు భారం, అందుకు తోడు బిల్లుల బకాయి. కరోనా మూలంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. రాబడి తగ్గిపోయింది. అదనంగా రూ. 7వేల కోట్లు భారం పడింది. దాంతో సమస్య ఉంది. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఇటీవల మండలిలో జరిగిన చర్చలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని,పెండింగ్ బిల్లులను ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is AP govt not paying the bills to contractors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X