కమలా హ్యారిస్ కు ట్రంప్ బిగ్ షాక్ ..!
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ విదేశాలపైనే కాదు స్వదేశంలో రాజకీయ ప్రత్యర్ధులపైనా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా భారతీయ మూలాలు ఉన్న అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ట్రంప్ షాకిచ్చారు. గతంలో కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు కల్పించిన ఓ సదుపాయాన్ని ట్రంప్ ఇప్పుడు తొలగించారు.
అమెరికాలో అత్యున్నత స్ధాయిలో ఉండే ప్రభుత్వ పెద్దలకు హోంశాఖ పరిధిలోని సీక్రెట్ సర్వీస్ భద్రతను కల్పిస్తారు. అయితే దీన్ని అధ్యక్షులకు మాత్రమే కల్పిస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఎన్నికలకు ముందు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ తన డిప్యూటీ అయిన కమలకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ ఇలా సీక్రెట్ సర్వీస్ భద్రతను కమలా హ్యారిస్ పొందుతున్నారు. దీన్ని ఇప్పుడు ట్రంప్ తొలగించారు.

జనవరిలో ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక కమలా హ్యారిస్ కు ఆరు నెలలుగా ఈ సీక్రెట్ సర్వీస్ భద్ర కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ట్రంప్ దాన్ని సమీక్షిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అప్పట్లో బైడెన్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం పదవిలో నుంచి కమల తప్పుకున్న ఏడాది పాటు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఆరునెలలలకే దీన్ని తొలగించేశారు.

గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అప్పట్లో ప్రచారం చేసిన 107 రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు కమలా హ్యారిస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో ట్రంప్ పై కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మరో మహిళా అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ సైతం ఇలాగే పురుష అభ్యర్ధి చేతిలో ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications