Trump vs Musk: ఎలాన్ మస్క్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఆ పని చేశావో ఇక ఖేల్ ఖతం..!
అమెరికాలో గతంలో బైడెన్ ప్రభుత్వంతో అంటకాగి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ తర్వాత తనతో విభేదించి ట్రంప్ కు మద్దతుగా నిలిచాడు. దీంతో గత ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే ఆరు నెలల్లోనే వీరిద్దరికీ చెడింది. ట్రంప్ దూకుడుతో చికాకుపుట్టిన మస్క్.. తనకు అప్పగించిన డోజ్ ఛీఫ్ పదవిని వదులుకోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడిపైనే వార్ ప్రకటించారు. ఈ వార్ రోజురోజుకీ తీవ్రమవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ఓ హెచ్చరిక ట్రంప్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉండేది మూడేళ్లేనని, తన హవా 40 ఏళ్లు ఉంటుందంటూ ఎలాన్ మస్క్ చేసిన హెచ్చరిక రాజకీయంగా తన పతనం లిఖించేలా ఉందని భావిస్తున్న ట్రంప్.. ఆయనకు మరో హెచ్చరిక చేశారు. తనను కాదని తన ప్రత్యర్థులైన డెమోక్రాట్లకు నిధులిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని మస్క్ ను ట్రంప్ హెచ్చరించారు.

అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లను శిక్షించాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్‌ను బెదిరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ముందు ఉన్న ట్రంప్ యొక్క పెద్ద, అందమైన వ్యయ బిల్లుపై మస్క్ చేసిన కఠినమైన విమర్శలు ఇప్పటికే వీరిద్దరి మధ్య స్నేహానికి చరమగీతం పాడేశాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నిలిచే రిపబ్లికన్లను సైతం మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఆయన బహిరంగంగా మస్క్ కు హెచ్చరికలు చేశారు.
అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ తెస్తున్న తాజా బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతిస్తున్న రిపబ్లికన్లకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు భారీగా నిధులు సమకూర్చాలని మస్క్ ను కోరారు. దీంతో మస్క్ అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ నేరుగా మస్క్ కు హెచ్చరికలు పంపారు. ఈ నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్న ట్రంప్ హెచ్చరికలపై మస్క్ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications