పీకల్లోతు కష్టాల్లో డొనాల్డ్ ట్రంప్-శృంగార తారకు డబ్బుల మళ్లింపుపై 34 అభియోగాలు ఖరారు..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ కు గత ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఓ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం చుట్టుకుంది. శృంగార తార స్ట్రోమీ డేనియల్స్ తో బంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ అక్రమంగా నిధులు చెల్లించిన వ్యవహారంలో ఆయనపై నమోదైన 34 అభియోగాలు రుజువయ్యాయి. దీనిపై అమెరికా కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది.

అమెరికాలో శృంగార తార స్ట్రోమీ డేనియల్స్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ కు 2016 ఎన్నికల సమయంలో ఇదో సమస్యగా మారే ప్రమాదం తలెత్తింది. దీంతో ఆయన స్ట్రోమీ ఈ వ్యవహారంపై నోరు విప్పకుండా ఆమెకు భారీ ఎత్తున డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సొంత నిధుల నుంచి కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన విరాళాల నుంచి ఇచ్చారు. దీన్ని కప్పిపుచ్చేందుకు బిజినెస్ రికార్డుల్ని ఆయన తారుమారు చేశారు. దీనిపై 34 అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అవన్నీ ఇప్పుడు రుజువయ్యాయి.
ఈ కేసు విచారణలో భాగంగా స్ట్రోమీ డేనియల్స్ స్వయంగా కోర్టుకు హాజరై డొనాల్డ్ ట్రంప్ తో తన బంధం నిజమేనని చెప్పేసింది. దీంతో ఆయన నుంచి తనకు అందిన డబ్బుల విషయం కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై అభియోగాల్ని ఖరారు చేస్తూ ఆయన్ను దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఓ వ్యక్తి దోషిగా నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. అయితే బిజినెస్ రికార్డులు మార్చడం అన్నది అమెరికాలో తీవ్రమైన నేరం కాకపోవడంతో దీన్ని జరిమానాతో కూడా సరిపెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న కోర్టు ఇచ్చే తీర్పు ఆయన అధ్యక్ష ఎన్నికల పోటీకి కీలకంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications