వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంకీ పాక్స్

ప్రపంచవ్యాప్తంగా జులై, 2022 నాటికి 14,000 మందికి మంకీ పాక్స్ సోకిందని, ఐదుగురు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

సావో పాలోలో నివాసముంటున్న థియాగో జ్వరం, అలసట, వణుకు, ఒళ్ళంతా ఏర్పడ్డ కురుపులతో ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు మంకీ పాక్స్ సోకినట్లు నిర్ధరణ అయింది.

ఆయనకు చర్మం పై వాపు, నొప్పితో పాటు, జననేంద్రియాలు దగ్గర విపరీతమైన మంట పుడుతున్నట్లు చెప్పారు. ఆయనకు జననేంద్రియాల పై 9 కురుపులు వచ్చాయి.

"దీంతో చాలా దురద, నొప్పి వస్తోంది. కురుపులు ఏర్పడ్డ ప్రదేశంలో బాగా వాచిపోయింది. ఒక్కొక్కసారి అగ్గిలో ఉన్నట్లుగా ఉంటోంది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

మంకీ పాక్స్.. మశూచిలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన అరుదైన వైరల్ వ్యాధి. సాధారణంగా మంకీ పాక్స్ సోకిన వ్యక్తులకు దగ్గరగా మెలిగినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది.

ఈ ఇన్ఫెక్షన్ చిట్లిన చర్మం, శ్వాస, నోరు, కంటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపించవచ్చు.

ఈ ఇన్ఫెక్షన్ తో కలుషితం అయిన దుస్తులు, దుప్పట్లు, తువ్వాళ్లను తాకినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది.

మంకీ పాక్స్

వ్యాధి లక్షణాలు

థియాగోకు మంకీ పాక్స్ లక్షణాలు జులై 10న కనిపించడం మొదలయింది. "మొదట వణుకుతో మొదలై తరువాత జ్వరం, తలనొప్పి, చికాకు కలిగాయి. నా శరీరం అంతా ముక్కలైపోతున్నట్లు అనిపించింది" అని చెప్పారు.

"ముందు సాధారణ జలుబు లేదా కోవిడ్ సోకిందని అనుకున్నాను. కానీ, స్నానం చేస్తున్నప్పుడు నా వీపు పైన, పురుషాంగం పైన కురుపులు రావడం గమనించాను".

"నెమ్మదిగా పాదాలు, తొడలు, అర చేయి, పొట్ట, గుండె, ముఖం, జననాంగాల పై కురుపులు రావడం గమనించాను.

"అవి నొప్పితో కూడిన మొటిమల్లా అనిపించాయి. ఈ లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లాను.

ఒక వారం ముందు థియాగో తన స్నేహితున్ని కలిశారు. ఆయనకు కూడా మంకీ పాక్స్ సోకినట్లు తెలిసింది.

ఆస్పత్రిలో చేసిన రక్త పరీక్షతో ఆయనకు వైరస్ సోకినట్లు తెలిసింది. లైంగిక సంక్రమణ వ్యాధుల నిర్ధరణ కోసం చేసిన పరీక్షలో మాత్రం నెగిటివ్ అని తేలింది.

దుస్తులు కూడా ధరించడం కష్టంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్ళడానికి జాప్యం చేశాను. కారులో ఆస్పత్రికి వెళ్లడంతో నొప్పి, వాపు మరింత ఎక్కువైపోయింది.

"డాక్టర్లు వాపు, నొప్పి తగ్గేందుకు మందులిచ్చారు. వీటితో పాటు మత్తు కలిగించే ఒక ఆయింట్ మెంట్ కూడా ఇచ్చారు. దీంతో, కొంచెం మంట తగ్గింది. కానీ, నాలుగు గంటల తర్వాత అది పని చేయడం మానేసి నొప్పి మొదలైపోయేది".

థియాగో ఇటీవల కాలంలో బ్రెజిల్ దాటి బయటకు ఎక్కడికీ వెళ్ళలేదు.

"నేను ఆస్పత్రి నుంచి బయటకు రాగానే వైరస్ సోకక ముందు నన్ను కలిసిన స్నేహితులందరికీ సమాచారం ఇచ్చాను. మా పొరుగువారికి కూడా చికిత్స గురించి చెప్పాను" అని చెప్పారు.

మంకీ పాక్స్

అపోహలు

నొప్పి, దురదను భరించడం మాత్రమే కాకుండా ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు చాలా కష్టంగా ఉండేదని థియాగో చెప్పారు.

"నా గాయాలను ఎలా శుభ్రపరుచుకోవాలో చెప్పలేదు. నేనెన్ని రోజులు అనారోగ్యంతో ఉంటానో, ఎప్పుడు ఐసోలేషన్ నుంచి బయటపడగలనో చెప్పలేదు. ఈ సమాచారం కోసం నేను ఇంటర్ నెట్ లో వెతికేవాడిని" అని చెప్పారు.

"మంకీ పాక్స్ సోకిన వారి కోసం ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాలు లేవు. మంకీ పాక్స్ సోకిన వారు కూడా ఆస్పత్రిలో అన్ని చోట్లా తిరిగేస్తున్నారు. వారికి ఈ రోగంతో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండకపోవచ్చు" అని అన్నారు.

డాక్టర్లు, నర్సులు చాలా దురుసుగా ప్రవర్తించేవారని చెప్పారు.

"ఆస్పత్రిలో అందరూ నాకు హెచ్ ఐవి పాజిటివ్ లేదా లైంగిక సంక్రమణ వ్యాధులున్నాయేమోనని అడిగేవారు" అని చెప్పారు.

ఈ రోగానికి సంబంధించి ఎల్ జీ బీ టీ క్యూ సమాజం గురించి చాలా అపోహలున్నాయని ఆస్పత్రికి వెళ్ళాక నాకు అర్ధమయింది.

బై సెక్సువల్ పురుషుల్లో మంకీ పాక్స్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ, ఇన్ఫెక్షన్ సోకిన వారికి దగ్గరగా మెలగడం వల్ల కూడా వైరస్ సోకుతుందని చెప్పింది.

యూకే, యూరోప్ లో కనిపించిన కేసుల్లో ఎక్కువగా స్వలింగ సంపర్కులు, బై సెక్సువల్ పురుషుల్లో నమోదైనట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పింది. అందుకే వారిని ప్రత్యేకంగా హెచ్చరించి అవసరమైతే సహాయం అడగమని చెబుతోంది.

మంకీ పాక్స్

మంకీ పాక్స్

మంకీ పాక్స్ పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవుల్లో కనిపిస్తోంది.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ ఏడాదిలో 1200 కేసులు నమోదు కాగా, మే 01, 2022 నాటికి 57 మరణాలు చోటు చేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికాలోని వైరస్ ఇప్పటికే మనుగడలో ఉండగా, పశ్చిమ ఆఫ్రికాలోని తేలికపాటి వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

ఆఫ్రికా ప్రయాణం చేయని వారిలో కూడా మంకీ పాక్స్ కేసులు కనిపిస్తున్నాయి.

మంకీ పాక్స్

ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు సెక్స్ చేయవద్దని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది. ఇన్ఫెక్షన్ తగ్గిన 8 వారాల తర్వాత కూడా ముందు జాగ్రత్త చర్యగా కండోమ్స్ వాడమని సూచిస్తోంది.

చాలా వరకు ఈ కేసులు చికెన్ పాక్స్ తరహాలో ఉండి కొన్ని వారాల తర్వాత క్రమేపీ తగ్గిపోతున్నాయి.

ఒక్కొక్కసారి ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమోదు చేసిన మరణాలన్నీ ఆఫ్రికాలోనే చోటు చేసుకున్నాయి.

ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 5 - 21 రోజులు పడుతుంది. సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఎక్కువగా అరిచేతులు, పాదాల పై వస్తాయి.

ఈ దురద చాలా చికాకుగా, నొప్పితో కూడుకుని ఉంటుంది.

ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా 14-21 రోజుల్లో తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Monkeypox: 'Abscesses on genitals...burning intolerable by wearing clothes'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X