అమెరికావి పగటికలలే! అది సైనికచర్యే, అణ్వాయుధాలు వదిలే ప్రసక్తే లేదు: ఉత్తరకొరియా
సియోల్: తాము అణ్వాయుధాలను వదిలేస్తామని అగ్రరాజ్యం అమెరికా పగటి కలలుకంటోందని ఉత్తరకొరియా చురకలు అంటించింది. సర్వశక్తులను ఒడ్డి తయారు చేసిన అణ్వాయుధాలను వదిలే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది.
వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా నిద్రలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాపై తాజాగా ఉత్తరకొరియా తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.

తమపై ఐరాస కఠిన ఆంక్షలు విధించడం ఒక రకంగా సైనికచర్యకు దిగినట్లేనని అని ఉత్తరకొరియా ఆరోపించింది. ఇలాంటి చర్యలకు అమెరికా పాల్పడటం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.
తాము ఇటీవల పరీక్షించిన సరికొత్త బాలిస్టిక్ క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతానికయినా సులభంగా చేరుకోగలదని ప్యాంగ్యాంగ్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలకు ఐరాస భద్రతామండలి సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
'అమెరికా దాని అనుచర దేశాలు ఆ తీర్మానాన్ని తీసుకొచ్చారని మేము భావిస్తున్నాం. ఇది మా దేశ ప్రజల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి సమాధి చేయడమే. ఆంక్షలు విధించడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతికి విఘాతం కలిగించడమే అవుతుంది..' అని ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.
అమెరికా క్షేమంగా ఉండాలనుకుంటే ఉత్తర కొరియా పట్ల ఉన్న తన విరుద్ధ విధానాలకు రద్దు చేసుకోవాలని హితవు పలికింది. సర్వశక్తులను ఒడ్డి తయారు చేసుకున్న అణ్వాయుధాలను తామెలా వదిలేస్తామని ఉత్తరకొరియా ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications