వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హ్యాకర్లు, సైబర్ క్రైమ్

సాధారణంగా హ్యాకర్లు అందినకాడికి సొమ్మును దోచుకుంటుంటారు. అయితే, డార్క్‌సైడ్ హ్యాకర్లుగా చెప్పుకుంటున్న ఓ ముఠా మాత్రం తాము దోచుకున్న దాంట్లో నుంచి కొంత మొత్తం దానం చేసింది.

పది వేల డాలర్ల (సుమారు 7.3 లక్షల రూపాయలు) చొప్పున బిట్ కాయిన్ల రూపంలో రెండు స్వచ్ఛంద సంస్థలకు దానం చేసినట్లు డార్క్ వెబ్‌లో పోస్ట్ పెట్టింది.

అయితే, విరాళాలు అందుకున్న ఆ రెండు సంస్థల్లో ఒకటైన చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ తాము ఆ దానం స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఇలా హ్యాకర్ల ముఠా విరాళం ఇవ్వడాన్ని నైతికంగా, చట్టపరంగా ఓ వింత పరిణామంగా విశ్లేషకులు చూస్తున్నారు.

తమ విరాళాలకు సంబంధించిన ట్యాక్స్ రిసిప్ట్‌‌లను అక్టోబర్ 13న డార్క్ వెబ్‌లో ఆ హ్యాకర్ల ముఠా పోస్టు చేసింది.

భారీగా లాభాలు ఆర్జించే సంస్థలపై మాత్రమే తాము ర్యాన్సమ్ వేర్ దాడులకు పాల్పడుతుంటామని ఈ హ్యాకర్లు చెబుతున్నారు. సంస్థల ఐటీ వ్యవస్థలను తమ నియంత్రణలోకి తీసుకుని, వారి నుంచి ఈ హ్యాకర్లు డబ్బులు వసూలు చేస్తుంటారు.

''ఆ సంస్థలు చెల్లించే డబ్బులో కొంత మంచి పనులకు వెళ్లడం సబబు అని మాకు అనిపించింది. మేం చేసే పని ఎంత చెడ్డది అని మీకు అనిపించినా, ఎవరో ఒకరి జీవితంలో మార్పు తీసుకురావడంలో సాయపడుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఈ రోజు మేం మా తొలి విరాళాలు ఇస్తున్నాం’’ అని ఆ పోస్టులో హ్యాకర్లు రాశారు.

చిల్డ్రెన్ ఇంటర్నేషనల్‌తో పాటు ద వాటర్ ప్రాజెక్ట్‌లకు ఈ విరాళాలను ఆ హ్యాకర్ల బృందం పంపింది.

హ్యాకర్లు, సైబర్ క్రైమ్

చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ సంస్థ భారత్, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఈక్వెడార్, జాంబియా, డొమినికన్ రిపబ్లిక్, గ్వాటెమాలా, హొండురాస్, మెక్సికో, అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు, కుటుంబ సంక్షేమం కోసం కృషి చేస్తోంది.

తమకు వచ్చిన విరాళం హ్యాకర్లకు చెందిందైతే, దాన్ని అంగీకరించే ఉద్దేశం తమకు లేదని చిల్డ్రెన్ ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

ఇక సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికన్ దేశాల్లో మంచి నీటి వసతులను కల్పించేందుకు పని చేస్తున్న ద వాటర్ ప్రాజెక్ట్... ఇంకా ఈ విరాళాల విషయమై స్పందించలేదు.

''ఇలా విరాళాలు ఇవ్వడం ద్వారా ఆ సైబర్ నేరస్థులు ఏం చేయాలనుకుంటున్నారన్నది పూర్తిగా తెలియదు. అపరాధ భావనను తగ్గించుకునేందుకై ఉండొచ్చు. లేకపోతే తమను తాము దోపిడీదారులుగా కాకుండా, రాబిన్ హుడ్ తరహా వ్యక్తులుగా చూపించుకునేందుకు ఇలా చేస్తుండొచ్చు. ఇలా విరాళాలు ఇవ్వడం మాత్రం అసాధారణమే. రాన్సమ్‌వేర్ దాడులకు పాల్పడే ముఠాలు ఇలా దానాలు చేయడం ఇదివరకు నేను ఎప్పుడూ చూడలేదు’’ అని సైబర్ భద్రత సంస్థ ఎమ్సిసాఫ్ట్‌కు చెందిన విశ్లేషకుడు బ్రెట్ కాలో అన్నారు.

హ్యాకర్లు, సైబర్ క్రైమ్

డార్క్‌సైడ్ హ్యాకర్స్ కొత్త ముఠా. క్రిప్టో కరెన్సీ మార్కెట్ విశ్లేషణలు ఆ ముఠా దోపిడీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

గత జనవరిలో ట్రావెలెక్స్‌తో పాటు వివిధ సంస్థలపై జరిగిన కొన్ని ప్రముఖ ర్యాన్సమ్‌వేర్ దాడుల వెనుక ఉన్న సైబర్ నేర ముఠాలతో డార్క్ సైడ్ హ్యాకర్స్‌కు కూడా సంబంధాలు ఉండొచ్చని సూచించే ఆధారాలు కనిపిస్తున్నాయి.

ఇక డార్క్ సైడ్ హ్యాకర్స్ ముఠా విరాళాలు ఇచ్చేందుకు వాడిని చెల్లింపు విధానం కూడా భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాకు చెందిన 'ద గివింగ్ బ్లాక్’ అనే సర్వీసును సైబర్ నిపుణులు ఇందుకోసం వాడుకున్నారు. 67 స్వచ్ఛంద సంస్థలకు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అందించేందుకు ద గివింగ్ బ్లాక్ ఉపయోగపడుతోంది.

ద గివింగ్ బ్లాక్‌ను 2018లో నెలకొల్పారు. ఎవరైనా క్రిప్టో కరెన్సీతో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చి, దీని ద్వారా పన్ను రాయితీలు పొందొచ్చు.

అయితే, సైబర్ నేరస్థులు తమ వేదిక ద్వారా ఆ విరాళాలు ఇచ్చినట్లు తమకు తెలియదని ద గివింగ్ బ్లాక్ బీబీసీతో చెప్పింది.

''అది దోచుకున్న సొమ్మేనా అన్నది నిర్ధారించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ దోచుకున్న సొమ్మే అయితే, వాస్తవంగా అది ఎవరికి చెందిందో వారికి అందించేలా కృషి చేస్తాం’’ అని పేర్కొంది.

''క్రిప్టో కరెన్సీ వినియోగించినందు వల్ల వారిని పట్టుకోవడం ఇంకా సులభం అవుతుంది. కష్టం కాదు’’ అని ద గివింగ్ బ్లాక్ వ్యాఖ్యానించింది.

అయితే, దాతల నుంచి ఎలాంటి గుర్తింపు సమాచారం సేకరిస్తారన్న విషయం ద గివింగ్ బ్లాక్ వెల్లడించలేదు.

బిట్ కాయిన్ చెల్లింపుల సేవలు అందించే చాలా సంస్థలు వినియోగదారుల గుర్తింపు వివరాలు సేకరిస్తాయి. అయితే, ద గివింగ్ బ్లాక్ ఇలా సేకరిస్తుందో, లేదో తెలియరాలేదు.

హ్యాకర్లు, సైబర్ క్రైమ్

ద గివింగ్ బ్లాక్ ద్వారా బీబీసీ అజ్ఞాతంగా విరాళం ఇచ్చేందుకు ప్రయత్నించి చూసింది. ఆ సమయంలో ద గివింగ్ బ్లాక్ ఎలాంటి గుర్తింపు వివరాలూ అడగలేదు. గుప్త విరాళాల కారణంగా వచ్చే సమస్యలను ఈ ఉదంతం బయటపెడుతోందని నిపుణులు అంటున్నారు.

''గుప్త విరాళాలు ఇస్తూ, పన్ను రాయితీల రసీదులు పొందుతున్నారంటే, వారిని ప్రశ్నించాల్సిందే. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను గుర్తించడంలో పరిశోధకులు, భద్రతా సంస్థలు చాలా పురోగతి సాధించారు. అయితే, లావాదేవీలు ఏ ఖాతా నుంచి ఏ ఖాతా మధ్య జరుగుతున్నాయన్నది మాత్రమే బయటపడుతోంది. అవి ఎవరి సొంతమన్న విషయం మాత్రం చాలా సంక్లిష్టమైంది. ఇలా గుప్త విరాళాలు అందించడాన్ని అనుమతిస్తే, మనీ లాండరింగ్‌కు అవకాశాలు పెరగొచ్చు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల సేవలందించే సంస్థలన్నింటినీ కేవైసీ పరిధిలోకి తేవాలి’’ అని చైన్ అనాలసిస్ సంస్థకు చెందిన క్రిప్టో కరెన్సీ పరిశోధకుడు ఫిలిప్ గ్రాడ్వెల్ అన్నారు.

ద గివింగ్ బ్లాక్ ద్వారా విరాళాలను తీసుకుంటున్న మిగతా స్వచ్ఛంద సంస్థలతోనూ బీబీసీ మాట్లాడింది.

తమకు తెలిసి నేరస్థుల నుంచి ఎప్పుడూ విరాళాలు తీసుకోలేదని సేవ్ ద చిల్డ్రెన్ సంస్థ తెలిపింది.

''క్రిప్టో కరెన్సీ విరాళాల ద్వారా నేరస్థులు స్వప్రయోజనాలు పొందడం సిగ్గు చేటు. గుప్త దాతలు కూడా మేం నమ్మే విలువలు పాటించేవారై ఉండాలని మేం కోరుకుంటున్నాం’’ అని 'షీ ఈజ్ ద ఫస్ట్’ స్వచ్ఛంద సంస్థ వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Robin Hood Hackers donating money and donating
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X