The Mukaab: ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ కడుతున్న సౌదీ అరేబియా-..!
అంతర్జాతీయంగా అతిపెద్ద భవనాలు, నిర్మాణాల్లో ముందున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు మరో రికార్డు దిశగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని సౌదీ అరేబియా నిర్మిస్తోంది. "ది ముకాబ్" పేరుతో సౌదీ ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ భారీ భవనం నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ గా పేరు తెచ్చుకోబోతోంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు.
సౌదీ అరేబియాలోని రియాద్‌లో 50 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ మెగా భవనం పని ప్రారంభమైంది. 'ది ముకాబ్' గా పిలిచే ఈ భారీ భవనం 1,300 అడుగుల ఎత్తు, 1,200 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న క్యూబికల్ నిర్మాణం. దాని సరిహద్దుల్లో 20 ఎంపైర్ స్టేట్ భవనాలను అమర్చగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ భవనం పూర్తయితే ఓ భవిష్యత్ నగరమే ఇందులో కనిపిస్తుందన అంచనా వేస్తున్నారు. ఇందులో రెసిడెన్షియల్ యూనిట్లు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ రకాల రిటైల్, డైనింగ్, విశ్రాంతి సౌకర్యాలు ఉండబోతున్నాయి.


సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క 'సౌదీ విజన్ 2030'లో భాగంగా ఈ భారీ కట్టడం నిర్మిస్తున్నారు. చమురుపై ప్రభుత్వం ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా చమురుయేతర జీడీపీని 51 బిలియన్ డాలర్లకు పెంచాలనేది దీని వెననుక ఉన్న ఉద్దేశం. అలాగే 3.34 లక్షల ఉద్యోగాలను సృష్టించడాన్ని కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ ఆధారిత సాంకేతికతను ఇందులో అమలు చేయబోతున్నారు. ఇస్లాం యొక్క అత్యంత పవిత్రమైన ప్రదేశం మక్కాలోని కాబాను ఇది పోలి ఉందని కొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications