అమెరికాలో సిక్కు వేర్పాటువాది హత్య కుట్ర భగ్నం-భారత్ పాత్రపై అలర్ట్ ?
భారత్ లో ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు కోసం పలు సిక్కు సంస్ధలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని కేంద్రం పట్టించుకోకపోవడంతో ఒత్తిడి పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చివరికి విదేశాల్లో భారత ఎంబసీలపై దాడులు, హిందూ దేవాలయాలపై విధ్వంసం కూడా సాగిస్తున్నాయి. ఇదే క్రమంలో విదేశాల్లో సిక్కు వేర్పాటువాదులపైనా దాడులు జరుగుతున్నాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కొందరు కాల్చిచంపారు. ఇది కాస్తా భారత్-కెనడా మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ఇలాంటి మరో కుట్రను అమెరికా అడ్డుకుంది.
ప్రత్యేక ఖలిస్తాన్ కోరుతూ విదేశాల్లో ఉద్యమాలు నడుపుతున్న సిక్కుల వేర్పాటు నేత గుర్ పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు జరిగిన కుట్రను అమెరికా తాజాగా భగ్నం చేసింది. అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం అందించింది. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.

పన్నూన్‌ను చంపేందుకు జరిగిన కుట్రలో భారత్ పాత్ర కూడా ఉండొచ్చన్న ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హెచ్చరిక జారీ చేసిందని కూడా ఈ కథనం పేర్కొంది. అమెరికన్ కెనడియన్ పౌరుడు అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అమెరికా లో సిఖ్స్ ఫర్ జస్టిస్ ను నడిపిస్తున్నారు. అయితే దీన్ని భారత్ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించింది. కెనడాలో మరో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని గతంలో ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన ఆరు వారాల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో పన్నూన్ తరహాలో పోరాడుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించాడు. దీనిపై కెనడాలో సిక్కులు అక్కడి ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పాత్రపై ఆరోపణలు చేశారు. ఈ ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. వీసాల రద్దు, దౌత్యాధికారుల బహిష్కరణల వరకూ పరిస్దితి వెళ్లింది. తాజాగా తిరిగి పరిస్ధితులు చక్కబడుతున్న తరుణంలో అమెరికాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. గతంలో కెనడా ఘటనలో అమెరికా కూడా భారత్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.












Click it and Unblock the Notifications