IPL 2023 : కోల్ కతా చేతిలో ఓడినా ప్లే ఆఫ్ కు చెన్నై ? మిగతా జట్ల నుంచి పోటీ ఇదే..
ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు రంజుగా సాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే సత్తా చాటుకున్న గుజరాత్, చెన్నై జట్లు ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి. గుజరాత్ కు మరో రెండు మ్యాచ్ లు, చెన్నైకు మరో మ్యాచ్ మాత్రమే మిగిలింది. అయితే వీటితో సంబంధం లేకుండానే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గుజరాత్, చెన్నై తమకు మిగిలిన మ్యాచ్ లలోనూ గెలిచినా, ఓడినా ప్లే ఆఫ్ చేరుకోవడం సాధ్యంగానే కనిపిస్తోంది.
కోల్ కతా రైడర్స్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. అయితే ఇప్పటికే 15 పాయింట్లు కలిగిన చెన్నై జట్టు మిగిలిన మరో మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్లకు చేరుకుటుంది. అలా కాకపోయినా గట్టి పోటీ ఉన్న ఈ టోర్నీలో ఇప్పటికే సాధించిన 15 పాయింట్లతోనే ప్లే ఆఫ్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చివర్లో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలపై నిన్న కేకేఆర్ చేతిలో ఎదురైన ఓటమి ప్రభావం లేదనే చెప్పుకోవచ్చు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ప్లే ఆఫ్ రేసుకు అడుగుపెట్టేందుకు ప్రస్తుతం ఉన్న పాయింట్లు సరిపోయేలా కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. మరో రెండు మ్యాచ్ లు మిగిలున్న దశలో డిఫెండింగ్ ఛాంపియన్ వాటిలో గెలిస్తే ఏకంగా 20 పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. అలా కాకపోయినా ఒక్క మ్యాచ్ గెలిచినా 18 పాయింట్లు వస్తాయి. అదీ గెలవకపోయినా 16 పాయింట్లు కూడా గుజరాత్ ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు సరిపోయేలా కనిపిస్తున్నాయి.
ప్లే ఆఫ్ రేసుకు అర్హత సాధించే విషయంలో ప్రస్తుత పాయింట్ల పట్టిక ఆధారంగా చూస్తే ఇక కేవలం ఒకే మ్యాచ్ మిగిలిన జట్లలో చెన్నై మినహా మిగతా జట్లు రాజస్తాన్, కేకేఆర్ 12 పాయింట్లు మాత్రమే కలిగి ఉన్నాయి. వీటిలో రాజస్తాన్ మాత్రమే ప్లస్ నెట్ రన్ రేట్ లో ఉంది. కాబట్టి ప్లే ఆఫ్ కు చేరేందుకు రాజస్తాన్ కు మాత్రమే అవకాశం ఉండొచ్చు. ఇక రెండేసి మ్యాచ్ లు మిగిలున్న జట్లలో గుజరాత్ ను మినహాయిస్తే 14 పాయింట్లతో ఉన్న ముంబై, 13 పాయింట్లు కలిగిన లక్నోకు మెరుగైన అవకాశాలున్నాయి. వీటిలో ముంబై రెండు మ్యాచ్ లు గెలిస్తే 18, లేక ఒక్క మ్యాచ్ గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరబోతోంది. అలాగే 13 పాయింట్ల లక్నో కూడా రెండు మ్యాచ్ లు గెలిస్తే 17, ఒక్క మ్యాచ్ గెలిచినా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications