అమ్మ ఊరెళ్ళింది.. హృదయాలను పిండేస్తున్న రేవతి కూతురు; బన్నీ.. ఈ బాధ తీరేదెలా!
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలోనే రేవతి కుమారుడు శ్రీ తేజ కూడా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. గత 12 రోజులుగా ఆసుపత్రి బెడ్ పైన శ్రీ తేజ మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు.
రేవతి కుటుంబంలో విషాదం
ఇదిలా ఉంటే ఈ ఘటనతో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, ఆపై ఆయనను కోర్టుకు తరలించడంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం, అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే రేవతి కుటుంబంలో విషాదం మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తుంది.

చావు బతుకుల మధ్య శ్రీ తేజ, అయోమయంలో శాన్విక
దిల్ సుఖ్ నగర్ లో ఎంతో సంతోషంగా భార్యాభర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవించింది రేవతి కుటుంబం. కొడుకు సంతోషం కోసం అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 బెనిఫిట్ షో కి వెళ్లడం అక్కడ ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో ఆమె చనిపోవడం తో వారి జీవితమే మారిపోయింది. ఓవైపు చావుతో శ్రీ తేజ ఆసుపత్రిలో పోరాటం చేస్తుంటే మరోవైపు రేవతి ఏడు సంవత్సరాల కుమార్తె శాన్విక అసలు ఏం జరిగిందో అర్థం కాని గందరగోళం లో ఉంది .
అమ్మ ఊరెళ్ళింది అంటున్న చిన్నారి
తన తల్లి ఊరికి వెళ్లిందని, మళ్ళీ తిరిగి రాదనీ, తన అన్న ఆసుపత్రిలో ఉన్నాడని, ఆసుపత్రి నుంచి అన్న తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్కూల్ కి వెళతామని శాన్విక చెబుతుంది. తన అన్న ఆసుపత్రి నుంచి నెల రోజుల్లో ఇంటికి వస్తాడని చెబుతుంది . అది విన్నవారి హృదయం ఒక్కసారిగా బాధకు గురవుతుంది. అమ్మ రోజు తనకు, అన్నయ్యకు అన్నం తినిపించేదని, బాగా చదువుకోవాలని చెప్పేదని శాన్విక చెబుతుంది.
చిన్నారుల జీవితంలో విషాదం మిగిల్చిన అల్లు అర్జున్ సినిమా
శాన్వికకు, శ్రీ తేజకు అల్లు అర్జున్ సినిమా జీవితంలో ఊహించని విషాదాన్ని మిగిల్చింది. తల్లి లేక అనాధలైన ఈ చిన్నారులకు ఏం చేసినా అల్లు అర్జున్ గానీ, ఆ రోజు తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఎవరు ఆ లోటును తీర్చలేరు. ఇక తాజా పరిణామాలతో ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అన్నది ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.
రేవతి కుటుంబం కోసం ఏం చేసినా తక్కువే
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తానని చెప్పారు. పుష్ప సినిమా టీం కూడా కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ఈ ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పైన పలువురు ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడుతున్నారు. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications