ప్రతీసారి ఇదే తంతు .. నాసిరకం నూలుతో బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగ సందర్భంగా తయారవుతున్న చీరలు నాసిరకం నూలుతో తయారవుతున్నాయని చేనేత శాఖ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చింది. ఏ ఏడాదికి ఆ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో డొల్లతనం బయట పడుతోంది. చీరల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా స్వాహా చేయడానికి అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి, వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో కుమ్మక్కు అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మొదటి నుండి బతుకమ్మ చీరలపై ఎప్పుడూ వివాదాలే
బతుకమ్మ.. తెలంగాణకే తలమానికమైన పండుగ. అలాంటి బతుకమ్మ రోజు ఆడబిడ్డలంతా కొత్త చీరలు ధరించి బతుకమ్మ పండుగ జరుపుకోవాలని భావించి తెలంగాణ సర్కార్ తెలంగాణలోని నిరుపేద మహిళలందరికీ కొత్త చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా నేత కార్మికులకు పని కూడా కల్పించడానికి వీలవుతుందని భావించింది. అయితే మొదటి సంవత్సరం చీరలు తయారీకి సమయం సరిపోక సూరత్ నుంచి తెచ్చిన చీరలను మహిళలకు అందించింది ప్రభుత్వం. అప్పుడు ఆ చీరలు బాగోలేదని మహిళలు రోడ్లమీద చీరలను దహనం చేసి తమ నిరసన తెలియజేశారు.

అప్పట్లో బతుకమ్మ చీరల రివ్యూలో రేవంత్ రెడ్డి వివాదం
ఇక ఆ తర్వాత సిరిసిల్ల నేత కార్మికుల తో బతుకమ్మ చీరలు తయారీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. అంతేకాకుండా బతుకమ్మ చీరలలో నాణ్యతా లోపాలు ఉన్నాయని, నాసిరకం చీరలు అందించారని మహిళల నుండి అసహనం వ్యక్తం అయింది.

నాసిరకం నూలుతో చీరల తయారు చేస్తున్న పరిశ్రమలకు నోటీసులు
ఇక ఈఏడాది కూడా చీరల తయారీలో అక్రమాలు బయటపడ్డాయి. నాసిరకం నూలుతో చీరలు తయారు చేయాలని చూసిన కొందరి వ్యవహారం అధికారుల తనిఖీలతో వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన కొంతమంది అధికార పార్టీ నేతలు, వస్త్ర పరిశ్రమల వ్యాపారులు కుమ్మక్కై నాసిరకం నూలుతో బతుకమ్మ చీరల తయారీకి ప్లాన్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చేనేత జౌళి శాఖ అధికారులు దాడులు నిర్వహించి నాసిరకం నూలుతో చీరలు తయారు చేస్తున్న ఆరు చేనేత పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారు.

నాసిరకం నూలుగా గుర్తించిన అధికారులు.. బ్లాక్ లిస్టులో ఆ పరిశ్రమలు
నూలును పరిశీలించిన అధికారులు నాసిరకంగా గుర్తించారు. మరో రెండు పరిశ్రమల యజమాని, అధికార పార్టీ స్థానిక నేత నోటీసులు తీసుకోలేదు. ఇక ఈ అక్రమాలపై అధికారులు చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజరామయ్యర్‌కు నివేదిక ఇచ్చారు. ఆమె ఆదేశాల మేరకు ఆయా పరిశ్రమలకిచ్చిన ఆర్డర్లను రద్దు చేయడంతోపాటు వాటిని బ్లాక్ లిస్టులో చేర్చారు. అక్రమాలకు పాల్పడిన పరిశ్రమలపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేస్తామని వెల్లడించారు అధికారులు.












Click it and Unblock the Notifications