జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఖుష్బూ .. చిరంజీవి ఏమన్నారంటే!!
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ సుందర్ కు అవకాశం కల్పించటంపై చిరంజీవి స్పందించారు.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సినీనటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ఈ పదవిలో ఖుష్బూ సుందర్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయిన ఖుష్బూ సుందర్ దేశవ్యాప్తంగా మహిళల సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ సుందర్ దేశంలోని మహిళల రక్షణ కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని, మహిళల రక్షణ కోసం పని చేస్తానని తేల్చి చెప్పారు.
ఖుష్బూ సుందర్ ఆ పదవికి అర్హురాలు: చిరంజీవి పోస్ట్
ఈ క్రమంలో ఖుష్బూ కు మంచి పదవి వచ్చిందని సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ నాయకులు సైతం ఖుష్బూకు విషెస్ చెప్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఖుష్బూ సుందర్ కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఖుష్బూ సుందర్ ఆ పదవికి అర్హురాలు అంటూ పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖుష్బూ సుందర్ వల్ల మహిళలకు సంబంధించిన సమస్యల పైన ఎక్కువ దృష్టి పెరుగుతుందని, పరిష్కారాలను కూడా సమర్థవంతంగా ఖుష్బూ పూర్తి చేయగలుగుతారని ఆమె పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వారి గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: చిరంజీవి
మహిళా సమస్యల పైన పోరాడుతున్న వారి గొంతుక మరింత శక్తివంతంగా ఖుష్బూ సుందర్ వల్ల మారుతుందని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. ఖుష్బూ సుందర్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి. చిరంజీవి, ఖష్బూ సుందర్ మధ్య మంచి స్నేహం ఉంది. వారిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఇటీవల ఇద్దరు కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించారు. ఖుష్బూ తో చిరంజీవికి ఉన్న స్నేహం నేపథ్యంలో ఆమెకు వచ్చిన అవకాశం పై చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసిన ఖుష్బూ సుందర్
ఇదిలా ఉంటే ఇప్పటివరకు బిజెపి కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న ఖుష్బూ కు ఇప్పుడు చట్టబద్ధమైన పదవి లభించింది. గతంలో డిఎంకె, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించిన ఖుష్బూ బిజెపిలో చేరి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించడంతో ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications