దక్షిణాది రాష్ట్రాల భద్రత, నేరాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
మారుతున్న నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణలో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కొనియాడారు.
పోలీసులకు ఇచ్చే వనరులు భద్రత కోసం చేసే పెట్టుబడిగా అభివర్ణించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు కోటి నుంచి రెండు కోట్ల వరకు ఎక్స్ గ్రేషియా, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు వంటి సంక్షేమ చర్యలను వివరించారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతికతను పంచుకుంటూ దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఆయా రాష్ట్రాలు తమ సొంత వనరులు, ప్రయత్నాలతో మాత్రమే నేరరహిత రాష్ట్రాలుగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అత్యంత కీలకమైన ఇలాంటి అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి" అని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. రోజురోజుకు నేరాల స్వభావం మారుతున్న ఈ కాలంలో ఎస్‌ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకంగా మారుతాయి.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా మారాలి. పోలీసింగ్‌లో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి అని చెప్పారు.దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, నేరాల రేటును అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.
పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడం, వామపక్ష తీవ్రవాద హింసకు ముగింపు పలకడం వంటి రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఐసీసీసీ వ్యవస్థను సమన్వయం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సమష్టిగా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ సదస్సు ఫలవంతమైన, నిర్మాణాత్మక చర్చలతో సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి హైదరాబాద్ మహానగరంలో పోలీస్ వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించాం. ఈ విభజన వల్ల పోలీసు కమిషనర్లు తమ భౌగోళిక పరిధిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత మెరుగైన ఫలితాలు అందించడానికి అవకాశం ఏర్పడిందన్నారు.
నేరాల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక దృష్టిని సారించడానికి వీలుగా హైడ్రా, ఈగల్, టీజీ-సేఫ్, టీజీ టీమార్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు రాష్ట్రాన్ని పూర్తిగా నక్సల్స్ రహితంగా మార్చడంలో విశేష కృషి చేసిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అభినందించారు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఎస్‌ఆర్‌పీసీసీ సదస్సును తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications
