పాతబస్తీ దీపావళి సందడి: చార్మినార్ దారుల్లో ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
వెలుగుల పండుగ, దీప కాంతుల దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని చారిత్రక చార్మినార్ పరిసరాలు శోభాయమానంగా మారాయి. ముఖ్యంగా చార్మినార్‌ను ఆనుకుని ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు పండుగ షాపింగ్ కొనుగోళ్లతో లాడ్ బజార్, మదీనా ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి.
ఈ భారీ రద్దీని నియంత్రించి, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 6 నుండి నవంబర్ 11 వరకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. పండుగ రోజుల్లో ఈ క్రింది ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలపై తీవ్ర పరిమితులు ఉంటాయి. మదీనా నుంచి చార్మినార్ మార్గంలో గుల్జార్ హౌజ్, చార్మినార్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించరు. ముర్గీ చౌక్ నుంచి చార్మినార్ దారిలో మార్కెట్ పరిసరాల నుండి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లిస్తారు.

మదీనా, నయాపూల్ వైపు నుండి వచ్చే వారు ఎస్‌వైజే కాంప్లెక్స్ కాంపౌండ్, కాళీ కమాన్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానం (ఆదివారం రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది). మీర్‌చౌక్ ప్రాంతం వైపు నుండి వచ్చే వారు ముఫీద్-ఉల్-అనామ్ బాలుర పాఠశాల ప్రాంగణం, సర్దార్ మహల్ వెనుక భాగం. షా అలీ బండ వైపు నుండి వచ్చే వారు చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, ప్రభుత్వ యునానీ ఆసుపత్రి కాంపౌండ్ వద్ద పార్కింగ్ చెయ్యాలి.
పురానాపూల్, బేగంబజార్ వైపు నుండి వచ్చే వారు సిటీ కాలేజ్ ప్రాంగణం, ఎంజే బ్రిడ్జ్ పరిసరాలు, కులీ కుతుబ్ షా (QQ) స్టేడియం, హుస్సేనీ ఆలం, ఖిల్వత్ వైపు నుండి వచ్చే వారు న్యూ ముర్గీ చౌక్, ఖిల్వత్ గ్రౌండ్స్, జులూ ఖానా మరియు లాడ్ బజార్ సమీపంలోని ఖిల్వత్ రోడ్డు వద్ద పార్కింగ్ చెయ్యాల్సి ఉంటుంది.
రద్దీ సమయంలో పాతబస్తీ గుండా ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు చార్మినార్ ప్రధాన రహదారికి బదులుగా చంద్రాయణగుట్ట, బహదూర్ పురా, లేదా నయాపూల్ బైపాస్ రోడ్లను ఎంచుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఏదైనా అత్యవసర ప్రయాణ సహాయం లేదా ట్రాఫిక్ సమస్యల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చు. పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను గమనిస్తూ, వారికి సహకరించాల్సిందిగా నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
