పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు కోడిగుడ్డు!
కోడిగుడ్లు తినే వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. కోడిగుడ్డు మంచి ప్రోటీన్ ఆహారమని చెబుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కోడి గుడ్డును తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కోడి గుడ్డుకు డిమాండ్ పెరిగిన క్రమంలో ప్రస్తుతం పోషకాహారంగా భావించబడుతున్న కోడిగుడ్ల ధర అమాంతం పెరిగింది. పేద మధ్యతరగతి ప్రజలకు కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం భారంగా మారుతున్న పరిస్థితి ఉంది.
8 రూపాయలకు చేరిన కోడిగుడ్డు ధరలు
గత కొద్ది నెలలుగా కోడిగుడ్ల ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉండగా తాజాగా గుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే మొదటిసారి కోడిగుడ్డు ధరలను చూసి వినియోగదారులు, వ్యాపారులు షాక్ కు గురవుతున్నారు.బహిరంగ మార్కెట్లో ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు లభించిన కోడి గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా ఎనిమిది రూపాయలకు చేరుకుంది.

నాటుకోడి గుడ్డు ధరలు ఇలా
హోల్ సేల్ మార్కెట్లలో కూడా ఏడున్నర రూపాయల వరకు పలుకుతుంది. గతంలో 160 రూపాయల నుంచి 170 రూపాయలకు ఒక ట్రే గుడ్లు దొరికితే ప్రస్తుతం 210 నుంచి 220 రూపాయలకు గుడ్ల ధర పెరిగింది. నాటు కోడి గుడ్ల ధర అయితే ఒక్కో గుడ్డు ధర 15 రూపాయల వరకు పలుకుతుంది.
గుడ్ల ధరలు పెరగటానికి కారణాలు ఇవే
సాధారణంగా చలికాలంలో గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండడం ఒక కారణమైతే, గుడ్లు తినే వాళ్ళ సంఖ్య ఈసారి ఎక్కువగా ఉండటంతో ఈ ధర మరింత పెరిగింది. అయితే ఈ స్థాయిలో ధరల పెరుగుదల పౌల్ట్రీ చరిత్రలో ఎప్పుడు చూడలేదని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. డిమాండ్ కు తగినట్టుగా ఉత్పత్తి లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశం లేదు
ప్రస్తుత పరిస్థితులను బట్టి గుడ్డు ధరలు మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి పండుగ శీతాకాలం ముగిసే వరకు ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. గతంలో కోల్డ్ స్టోరేజీలో దాదాపు 20 కోట్ల గుడ్లు నిల్వ ఉండేవని ప్రస్తుతం ఆ గుడ్ల నిల్వలు గన్ని ఈయన తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు
గుడ్ల ధరలు పెరగడంతో ప్రతీ ఒక్కరికి ఇబ్బంది
ముఖ్యంగా కోళ్ల దాణాకు అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడంతో చిన్న మధ్య తరహా రైతులు కోళ్ల ఫారాలను మూసివేశారని ఫలితంగా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు. కారణాలు ఏవైనా గుడ్ల ధరలు పెరగడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ధరల ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల పైన కాకుండా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన కూడా పడుతుంది.
ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూపులు
ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల పైన కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా పెరిగిన గుడ్ల ధరలు గుడ్లు తినాలని ఆశ పడుతున్న వారి ఆశల మీద నీళ్లు పోస్తున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గుతాయని సామాన్యులు ఎదురు చూసేలా చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications