గ్యాస్ వినియోగదారులకు ఫైనల్ అలెర్ట్.. రేపటిలోగా ఈకేవైసీ పూర్తి చెయ్యండి!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్యాస్ గృహ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌కు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియపై సదరు కంపెనీలు అత్యవసర అలెర్ట్ జారీ చేశాయి. బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అనే ఈ-కేవైసీ ప్రక్రియను రేపటిలోపు పూర్తి చేయాలని, లేదంటే గ్యాస్ సబ్సిడీ వర్తించదని స్పష్టం చేశాయి.
నిబంధనను పాటించకపోతే సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం
ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ నిబంధనను పాటించకపోతే సబ్సిడీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని, వినియోగదారులు ఈ విషయాన్ని మర్చిపోకూడదని చెప్తున్నాయి. అలాగే సాధారణ ధరకు సిలిండర్ పొందలేక, అధిక ధర చెల్లించాల్సి రావచ్చని పేర్కొంది. కనెక్షన్ పూర్తిగా రద్దు కాకపోయినా, సేవల్లో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి.

ఆన్‌లైన్ పోర్టళ్లలో రద్దీ, సర్వర్ సమస్యల కారణంగా గడువు పొడిగింపు
ఈ చర్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో పారదర్శకత పెంచడం, నకిలీ కనెక్షన్లు నివారించడం కోసం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కాకుండా సాధారణ గృహ వినియోగదారులు, ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేయాలి. గతంలో ఆన్‌లైన్ పోర్టళ్లలో రద్దీ, సర్వర్ సమస్యల కారణంగా గడువు పొడిగించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం రేపటితో ముగిసే అవకాశం ఉంది.
ఓటీపీ ద్వారా లాగిన్ అయి, ఫేస్ స్కాన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
ఈ-కేవైసీ పూర్తి చేయడం చాలా సులభం. వినియోగదారులు తమ గ్యాస్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఆధార్ కార్డు నంబర్, కన్స్యూమర్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక యాప్‌లైన ఇండియన్‌ఆయిల్ వన్, హలో బీపీసీఎల్, హెచ్‌పీ పే తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓటీపీ ద్వారా లాగిన్ అయి, ఫేస్ స్కాన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది.
వినియోగదారులు వెంటనే గ్యాస్ ఈకేవైసీ చేయించుకోండి
యాప్ ద్వారా సాధ్యం కాకపోతే సమీప గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లి కూడా పూర్తి చేసుకోవచ్చు. గడువులోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోవడమే కాకుండా, భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి వినియోగదారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్‌లో సమస్య వస్తే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి సహాయం పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధారణ సబ్సిడీ ధరలకు సిలిండర్ పొందే అవకాశం కొనసాగుతుంది. కాబట్టి రేపటిలోపు తప్పకుండా పూర్తి చేసుకోవాలని గ్యాస్ వినియోగదారులందరికీ సూచన.













Click it and Unblock the Notifications