కొండగట్టు అంజన్న భక్తులకు అదిరిపోయే న్యూస్!
తెలంగాణా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపైన తెలంగాణా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఆ తర్వాత ఆలయ పునరుద్ధరణకు అవసరమైతే 500 నుంచి 600 కోట్లు ఖర్చు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపైన హామీ ఇచ్చారు.
కొండగట్టు మాస్టర్ ప్లాన్ కోసం అడుగులు
ఇప్పటివరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించలేదు. అయితే తాజాగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్న సమయంలో ఇటీవల దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ పరిసరాల్లో కొలతలు తీసుకుని మాస్టర్ ప్లాన్ కోసం ఉన్నతాధికారులకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ అమలు అయితే ఆలయ రూపురేఖలలో మార్పు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధుల కేటాయింపులు ఉన్నప్పటికీ గత 20సంవత్సరాలుగా మాస్టర్ ప్లాన్ ని రూపొందించడంలో ఆచరణలో లోపాలు ఉన్నాయి. దీంతో ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే మాస్టర్ ప్లాన్ అమలు అయితే ఆలయ రూపురేఖలు మారుతాయని స్థానికులు భావిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ అమలయితే ఈ వసతులు
ముఖ్యంగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో స్వామివారిని ఊరేగించే మాడవీధులు, మాస్టర్ ప్లాన్ రూపొందితే అందుబాటులోకి వస్తాయి. ఆలయం విస్తరించబడుతుంది. శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలను తొలగించడంతో పాటు భక్తుల వసతి కోసం వసతి గృహాలు విశాలమైన పార్కింగ్ స్థలం మెట్ల దారి, శానిటేషన్ పనులు, నీటి వసతి, ప్రసాదం తయారీకి, అన్నదానానికి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వస్తాయి.
మాస్టర్ ప్లాన్ జాప్యంతో తాత్కాలిక వసతుల కల్పన
ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ అమలులో జాప్యం జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా భక్తులకు వసతులు కల్పించడం కోసం అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. హరిత అతిథి గృహం పక్కన త్వరలో ఎనిమిది కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో కూడిన ఎనిమిది కాటేజీల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఇటీవల కాలంలో అడుగులు పడడంతో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications