సీతక్క ప్రమాణం: దద్దరిల్లిన ఎల్బీస్టేడియం.. సీతక్కకు, కొండా సురేఖకు సోనియాగాంధీ ఆలింగనం!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కొలువుదీరింది. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.
ప్రమాణస్వీకారానికి సీతక్కని పిలిచిన వెంటనే ఆమె వేదికపైకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో హోరెత్తారు. ఎల్బీ స్టేడియం ప్రాంగణమంతా మోత మోగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన అభిమానులకు అభివాదం చేసిన సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెబితే సీతక్క మాత్రం దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు.

తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, తెలంగాణా రాష్ట్ర మంత్రిగా, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్త శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను" అంటూ ప్రమాణం చేశారు.
సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం..!!#Seethakka #AnasuyaSeethakka #RevanthReddyCM #RevanthForTelanganaCM #RevanthReddy #TelanganaCM #Oneindiatelugu pic.twitter.com/33uZtURt0P
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2023
సీతక్క ప్రమాణస్వీకారం అనంతరం కూడా స్టేడియంలో జయ జయ ధ్వానాలు మారుమోగాయి. అనంతరం సీతక్క ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హత్తుకుని, నవ్వుతూ ఆమె భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. సీతక్క మాత్రమే కాదు కొండా సురేఖను సైతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆలింగనం చేసుకోవడంతో కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా మంత్రులంతా తెలుగులో ప్రమాణం చెయ్యగా ఒక్క దామోదర రాజనర్సింహ ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి సహా మిగతా మంత్రులంతా దైవ సాక్షిగా అని ప్రమాణం చేస్తే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క మాత్రమే పవిత్రమైన హృదయంతో అని ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications