వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ మీ చరిత్ర!: కెసిఆర్ ఏమన్నారు, ఆ ముగ్గురి కౌంటర్ ఏమిటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలోని హన్మకొండ బహిరంగ సభలో తమ పైన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, హన్మకొండ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ... మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి, బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానికి వారు కూడా ప్రతిస్పందించారు.

కెసిఆర్ తీవ్ర వ్యాఖ్య-జైపాల్ రెడ్డి కౌంటర్

కెసిఆర్ మాట్లాడుతూ... 'జైపాల్ రెడ్డి అనే మహా నాయకుడు వచ్చాడు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నావ్ కెసిఆర్ అన్నాడు. ఇప్పుడో రాయి తీసుకొని నెత్తిన కొట్టుకోవాలా. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ఎక్కడున్నాడో తెలంగాణ ప్రజలకు తెలియదా. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, సకల జనుల సమ్మెలో ఉర్రూతలూగించింది మీ బిడ్డ కేసీఆరే.'

Jana, Jaipal, Kishan counter to KCR

కెసిఆర్ వ్యాఖ్యల పైన జైపాల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. 'ముఖ్యమంత్రిగా నిగ్రహం కోల్పోయి, సంయనం పాటించకపోతే నష్టపోయేది కెసీఆరే. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేపట్టిన రెండు రోజులకే బంధు మిత్రుల సమక్షంలో ఖమ్మంలో స్వచ్చంధంగా దీక్ష విరమించిన కెసిఆర్‌కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఏ పాటి నిబద్ధత ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసు. దీక్ష వెనుక అసలు మర్మం ఏమిటో త్వరలోనే వెల్లడిస్తా' అన్నారు.

ఇంకా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... 'నేను నాడు కేంద్ర కేబినెట్లో లేకపోయినా, మంత్రి పదవికి రాజీనామా చేసినా తెలంగాణ వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఏర్పడేది కాదు. పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ అయ్యేది కాదు' అని ధ్వజమెత్తారు.

కెసిఆర్‌కు జానారెడ్డి కౌంటర్

హన్మకొండ బహిరంగ సభలో కెసిఆర్.. జానారెడ్డి గురించి మాట్లాడుతూ 'జానారెడ్డి అనే పెద్ద మనిషి కూడా అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఈయన చరిత్ర కూడా చెప్పాల్సి ఉంది. 1992లో నేను, జానారెడ్డి ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం. నేను టిడిపిలో ఉంటే, జానారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు.

Jana, Jaipal, Kishan counter to KCR

విజయ భాస్కర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి. ఈయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తెలంగాణ ఫోరం అనే దుకాణం మొదలు పెట్టాడు. నన్ను రమ్మన్నాడు. అప్పుడు నేను అన్నాను... జానారెడ్డి గారు ఓ మంత్రి పదవి కోసం తెలంగాణ తప్ప మరొకటి దొరకలేదా మీకు అని.

ఎన్నిమార్లు అవమానపరుస్తావు అని చెప్పాను. నేను రాను అని చెప్పాను. కచ్చితంగా ఇరవై రోజుల్లో విజయ భాస్కర రెడ్డి ఆయనను పిలిచి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దాంతో తెలంగాణ కొట్టుకుపోయింది. జానారెడ్డి ఆరాంగా మంత్రి పదవిలో ఉన్నాడు. నేను చెప్పింది నిజం కాదా అనేది ప్రజలు ఆలోచించాలి' అని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్ వ్యాఖ్యలపై జానా రెడ్డి మాట్లాడుతూ... 'ప్రత్యేక తెలంగాణ కోసం నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవినే వదులుకున్నా. మంత్రి పదవుల కోసం ఏనాడూ తెలంగాణ అంశాన్ని తాకట్టు పెట్టలేదు. 1992లో మంత్రి పదవి కోసం తాను తెలంగాణ ఫోరం పెట్టలేదు.

Jana, Jaipal, Kishan counter to KCR

ఆనాడు నర్సారెడ్డి, నారాయణ రెడ్డి, జగపతి రావులు తనను తెలంగాణ ఫోరానికి అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత కోట్ల మంత్రివర్గంలో చేరాను. ఈ విషయం గురించి నేను ఏనాడు కూడా కెసిఆర్‌తో చర్చించలేదు. అసలు విషయాన్ని దాచి పెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్దాలు మాట్లాడి, తన స్థాయిని దిగజార్చుకున్నారు.

తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ నాతో చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు. తెలంగాణ వచ్చేలా మేం అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించాం. ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. అయితే తెలంగాణ ఇస్తానంటేనే ఆ పదవి చేపడతానని సోనియాకు నేను చెప్పా' అని జానారెడ్డి కొంటర్ ఇచ్చారు.

కెసిఆర్ రాజీనామాకు కిషన్ రెడ్డి సకల జనుల కౌంటర్

బహిరంగ సభలో కెసిఆర్ బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ... 'కిషన్ రెడ్డి కూడా పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు. నేను నిరాహార దీక్ష చేపట్టాక ఖమ్మం జైలు నుంచి నిమ్స్‌కు తీసుకు వచ్చారు. అప్పుడు నేను చావుకు తయారయ్యా. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చింది.

తర్వాత వాపసు తీసుకున్నారు. చంద్రబాబు మోసం చేస్తే వాపసు తీసుకున్నారు. ఆ సమయంలో ఉధృతమైన సమ్మెకు శ్రీకారం చుట్టాం. అన్ని పార్టీలతో సమావేశం పెట్టాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయం జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తేవాలనుకున్నాం.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం. కాంగ్రెస్, టిడిపి వాళ్లు వీపు చూపించారు. బిజెపికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు (యెండల లక్ష్మీనారాయణ) రాజీనామా చేశారు. ఇవాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయాడు.

రాజీనామా చేయమంటే కొంతమంది దద్దమ్మలు పారిపోయారని నేను అప్పట్లో నిజామాబాదులో ప్రసంగిస్తున్నా. అప్పుడు ఓ వ్యక్తి లేచి.. నీ పక్కనే ఓ దద్దమ్మ ఉన్నారని అన్నాడు. ఎవరా అని నేను పక్కకు తిరిగి చూశా. అక్కడ చూస్తే కిషన్ రెడ్డి ఉన్నాడ'ని కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 'ఉద్యమం నుంచి నేను పారిపోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అసలు ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమిటో చెప్పాలి. ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు.

సాగరహారంలో కేసీఆర్ ఎక్కడున్నాడు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన వారి కుటుంబాలను విస్మరించింది ఎవరు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... కేసీఆర్ ఎదురు దాడి దిగుతున్నారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తోంద'ని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

English summary
Congress senior leader Jana Reddy, Jaipal Reddy, BJP chief Kishan Reddy counter to Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X