దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాంగ్రెస్ మాటలు.. ప్రియాంకా గాంధీపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు!!
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ నిన్న యువ సంఘర్షణ సభలో పాల్గొని యూత్ డిక్లరేషన్ ప్రకటించడంపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, హత్య చేసి శవం మీద దండలు వేసి కన్నీరు కార్చి నట్టుగా ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఆత్మబలిదానాలు జరిగాయని అమరవీరుల కుటుంబాలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం.. డబ్బులు ఇస్తామని ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు . కాంగ్రెస్ చేసిన మోసం తోనే అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.

కాంగ్రెస్,బీజేపీ తీరుపై విరుచుకు పడిన మంత్రి 25 ఏళ్ల కిందనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆత్మబలిదానాలు జరిగేవా? అంటూ ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలు ఉండేవా? అంటూ నిలదీశారు. దేశం కోసం గాంధీ ఏ విధంగా అయితే పోరాటం చేశారో అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాటం చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
ప్రాణాలకు తెగించి కేసిఆర్ చేసిన పోరాటం ఫలితంగా దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు లక్ష 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా 80 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ముఖ్యమంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అటువంటప్పుడు తెలంగాణలో ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తారో చెప్పాలన్నారు. ఎన్నికలు వస్తున్న క్రమంలో గారడి మాటలు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీ ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఇచ్చారా ? అంటూ నిలదీశారు. కాంగ్రెస్, బి.జె.పి నాయకులు దగుల్బాజీ మాటలను మాట్లాడుతున్నారని, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలి అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.












Click it and Unblock the Notifications