ఖమ్మం జిల్లా వాసులకు మంత్రి శుభవార్త.. 300కోట్లతో మరో 5వేల ఇళ్ళు..దసరాకే ముహూర్తం!
ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పేదలకు రూ.300 కోట్ల వ్యయంతో 5 వేల ఇళ్లు నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాన్లా ఫౌండేషన్ ఎండీ దాసరి ఉదయ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది.
సత్తుపల్లి మండలం గంగారంలోని తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో అధునాతన ల్యాబొరేటరీ సేవలను తాజాగా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల్లో గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, అయితే అప్పట్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామని చెప్పారు.

ప్రస్తుతం గ్రామంలో పేదలు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వం భూమి ఇస్తే ఎన్ని వందల ఇళ్లైనా నిర్మిస్తానని ఉదయ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.దీంతో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు కేటాయించి 5 వేల ఇళ్లు నిర్మించాలని కోరగా ఆయన అంగీకరించారు. నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
దసరా పండగ రోజునే గంగారంలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి, ఏడాదిన్నరలోగా పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అలాగే తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో వైద్యశాల నిర్మించి ప్రభుత్వానికి అప్పగించనున్నామని కూడా ఈ సమయంలో ప్రకటించారు. దీనిని డిసెంబరులో సీఎం ప్రారంభించనున్నామని తెలిపారు.
అదే స్థాయిలో తాన్లా ఫౌండేషన్ గంగారంలో 20 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు కోసం ప్రభుత్వంతో పాటు ఇలా స్వచ్చందంగా ప్రజలు, పలు సంస్థలు కలిసి రావటం శుభ సూచకం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏది ఏమైనా దసరా నుండి 5 వేల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించటం నిజంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు శుభ సూచకం.













Click it and Unblock the Notifications
