MLC Kavitha: బెయిల్ కోసం కోర్టులో నేడు, రేపు కవితకు అగ్నిపరీక్ష
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకుని విలవిలలాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఆమె చెయ్యని ప్రయత్నం ఏమీ లేదు. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు ఉచ్చు బిగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు సిబిఐ అధికారులు ప్రయత్నం చేస్తుంటే, ఈ కేసు నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం కవిత కోర్టుల వేదికగా పోరాటమే చేస్తున్నారు.
నేడు హైకోర్టులో మళ్ళీ కవిత బెయిల్ పిటీషన్ విచారణ
ఇక నేడు మరోమారు సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ కొనసాగుతుంది. దీంతో ఈ విచారణ అయినా ఆమెకు బెయిల్ వచ్చేలా సాగుతుందా అన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. మార్చి 15న ఈ కేసులో అరెస్ట్ అయిన నాటి నుండి నేటివరకు ఆమె ఈ కేసు ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు.

నేడు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న సీబీఐ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును, అవినీతి ఆరోపణలతో సిబిఐ కేసును ఎదుర్కొంటున్న, బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో 24వ తేదీ విచారణ జరగగా, ఈ కేసుకు సంబంధించి సిబిఐ కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరిన విషయం తెలిసిందే. నేడు సిబిఐ అధికారులు కోర్టు ముందు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
వాదనలు విననున్న బెంచ్
మరోవైపు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. నేడు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ముందు కవిత సిబిఐ కేసులోనూ, ఈడీ కేసులోనూ బెయిల్ పిటిషన్ ల పైన న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం సింగిల్ బెంచ్ విచారణ జరపగా నేడు కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఈ కేసులో వాదనలను విననున్నారు.
నేడు, రేపు వాదనలు.. బెయిల్ వస్తుందా?
నేడు రెండు కేసులలో కవిత తరపున వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించిన క్రమంలో విక్రమ్ చౌదరి కవిత తరపున వాదన వినిపించనున్నారు. రేపు ఈడి, సిబిఐ వాదనలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం బెయిల్ కోసం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్న కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది త్వరలోనే తెలియనుంది. ఇప్పటివరకు కవిత బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమయ్యాయి. ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.












Click it and Unblock the Notifications