నాగార్జునసాగర్ లో కృష్ణమ్మ సోయగాలు చూసేందుకు ప్రత్యేక బస్సులు.. వెళ్ళిరండి!!
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుండి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం వద్ద గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది.
సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల
నాగార్జునసాగర్ వద్ద మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ 22 గేట్లు ఐదు అడుగులు, నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహాన్ని అదుపు చేసేందుకు అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..

ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద మెయింటెయిన్ చేస్తున్నారు.. ఎగువ నుంచి ఇన్ ఫ్లో గా 2,53,534 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా కుడి ఎడమ కాలువల తో పాటు, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. క్రస్ట్ గేట్ల సాయంతో 2,69,562 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ కు పర్యాటకులు... తెలంగాణా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
26 గేట్లు ఎత్తి నీటిని దిగువలకు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ అందాలు చూడడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఒక్కసారే 26 గేట్లను ఎత్తడంతో సాగర సుందర దృశ్యాలను చూడాలని చాలామంది నాగార్జునసాగర్ కు ప్రయాణమయ్యారు. సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరగడంతో తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
హైదరాబాద్ నుండి నడుస్తున్న ప్రత్యేక బస్సులిలా
హైదరాబాద్ ఎంజీఎంఎస్ బస్టాండ్ నుంచి డైరెక్ట్ గా నాగార్జునసాగర్ కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రీజియన్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మొదలై 6.45 నిమిషాలకు, 7.15 నిమిషాలకు, 7.30 నిమిషాలకు, 8 గంటలకు, 9. 45 నిమిషాలకు, 10.45 నిమిషాలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు, సాయంత్రం 5:40 నిమిషాలకు నాగార్జునసాగర్ కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.
కృష్ణమ్మ పరవళ్ళ నాగార్జున సాగర్ అందాలు చూసెయ్యండి
నల్లగొండ డిపో ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక మరెందుకు ఆలస్యం సాగర్ అందాలను చూడాలనుకుంటున్న వారు ఆర్టీసీ వారు ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సాగర్ లో కృష్ణమ్మ అందాలు చూసి మైమరచిపొండి. ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత జల సౌందర్యాన్ని చూసి రిలాక్స్ అవ్వండి.












Click it and Unblock the Notifications