పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి: తాడోపేడో తేల్చుకుంటా.. అర్ధనగ్న ప్రదర్శనతో ఎమ్మెల్యే నిరసన!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలో వార్ ముదురుతోంది. బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు రోడ్డెక్కింది. ఏకంగా ఎమ్మెల్యే అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపే దాకా వెళ్ళింది. జనగామ బీఆర్ఎస్ లో ముదురుతున్న వార్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాడోపేడో తేల్చుకుంటామని ఏకంగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రంగంలోకి దిగడం, అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వర్గపోరు పోలీస్ కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. రాఖీ పండుగ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మహిళా ప్రజా ప్రతినిధులను తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో ముత్తిరెడ్డి వర్గానికి చెందిన విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారు.

దీంతో పల్లా వర్గానికి చెందిన అనుచరుడు, పల్లా బంధువు జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పట్టణ సిఐ విజయ్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. దీంతో దళితుడైన తనపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాడి చేయిస్తున్నారని, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అతను సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఈ క్రమంలోనే నేడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో బీఆర్ఎస్ దళిత సంఘాలు నల్ల జండాలతో నిరసన తెలిపాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. దళితద్రోహి పల్లా గో బ్యాక్ అంటూ ముత్తిరెడ్డి నినాదాలు చేశారు.
దళితులపై కేసులు పెట్టడం కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు తాను క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన భూ కబ్జాల ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఇక తాజా పరిణామాలతో వీరిద్దరి మధ్య వివాదం ఎక్కడ వరకు వెళుతుంది అనేది రాజకీయ వర్గాలలో ఉత్కంఠకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications