తెలంగాణా పర్యటనకు ప్రియాంకా గాంధీ: ముహూర్తం ఫిక్స్; హస్తం శ్రేణుల్లో నయా జోష్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, అందిస్తున్న పథకాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే పోరు బాట పట్టాయి.
ఇక కాంగ్రెస్ మరింత దూకుడుగా తెలంగాణలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంది కాంగ్రెస్ పార్టీనే అని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ పెంచడానికి జాతీయ స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు.

మే 8వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణలో సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే ప్రియాంకాగాంధీ మొదట మే 5 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని షెడ్యూల్ ఖరారు చేసినప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది. కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈనెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంది. 8వ తేదీతో అక్కడ ప్రచార పర్వం ముగియనుంది. దీంతో 8వ తేదీన ప్రియాంక గాంధీ అక్కడి నుండి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో పర్యటించనున్నారు. సరూర్నగర్ నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంకాగాంధీ వస్తున్న నేపథ్యంలో జనసమీకరణ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పై ప్రజల దృష్టి పడేలా చేయాలని పార్టీ నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ పర్యటన నేపథ్యంలో, ప్రియాంక గాంధీ పర్యటన ఏర్పాట్లపై, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు ఠాక్రే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ప్రజల వద్దకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రియాంక గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ కోసం వాడుకోనున్నారు. దీంతో ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో జోష్ నెలకొంది. రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ప్రియాంక సభను సక్సెస్ చేయడానికి ముందుకు సాగుతున్నారు.












Click it and Unblock the Notifications