రేవంత్ రెడ్డి నీచమైన వ్యక్తి .. రాజాసింగ్ అద్భుతమైన హాస్యనటుడు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపి పార్టీ నేతల మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతున్నాయి, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నేతలు, టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రస్ నేతలపైన, గులాబీ నేతలు, గులాబీ నేతల టార్గెట్ గా కాంగ్రెస్ నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు . తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

రాహుల్ గాంధీ జీ, మీరు అత్యంత నీచమైన మనిషిని టీపీసీసీ చీఫ్ గా ఎంచుకున్నారు
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా నాయకుడు కెసిఆర్ రాజకీయాలకు అతీతంగా నిలిచిన రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్న కేటీఆర్, అస్సాం సిఎం అవమానకరమైన మాటలు మాట్లాడినప్పుడు దివంగత రాజీవ్ గాంధీ గౌరవాన్ని కాపాడారని వెల్లడించారు. ఇప్పుడు మీ పిసిసి చీప్ మా నాయకుడి జన్మదినం సందర్భంగా చావు రావాలని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జీ, మీరు అత్యంత నీచమైన మనిషిని టీపీసీసీ చీఫ్ గా ఎంచుకున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
పుట్టినరోజు వేడుకలకు బదులు చావు వేడుకలు జరుపుకోవాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పన్నెండు రోజుల పాటు దిన కర్మ కార్యక్రమాలు నిర్వహించాలని మండిపడ్డారు. మూడు రోజుల పుట్టినరోజు వేడుకలు కాకుండా 12 రోజుల వర్ధంతి వేడుకలను స్వయంగా నిర్వహించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును టిపిసిసి చీఫ్ ఎ రేవంత్ రెడ్డి మంగళవారం దుర్భాషలాడారు.

మీ మరణానంతరం చేస్తారన్న గ్యారెంటీ లేదు.. అందుకే ఇప్పుడే చేసుకోండి అన్న రేవంత్
"మీ దగ్గర డబ్బు ఉంది, మరి మూడు రోజుల పుట్టినరోజు వేడుకలు మాత్రమే ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు మీ స్వంత 12-రోజుల మరణ వేడుకను నిర్వహించవచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు . జీవించి ఉన్నప్పుడు కూడా తమ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. అదేవిధంగా, మీరు మీ స్వంత మరణ వేడుకను చేసుకోవచ్చని సెటైర్ వేశారు. మీ మద్దతుదారులు 12వ రోజు మీకు నివాళులర్పిస్తారు. మీ మరణానంతరం వారు చేస్తారన్న గ్యారెంటీ లేదు'' అని మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలపై రేవంత్ రెడ్డి స్పందించారు.
బీజేపీకి అద్భుతమైన హాస్యనటుడు దొరికాడు
బిజెపికి ఒక అద్భుతమైన హాస్య నటుడు దొరికాడని కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు ఇంతకంటే దిగజారరులే అని అనుకున్న సమయంలోనే ఈ అద్భుతమైన హాస్య నటుడు దొరికాడు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. యూపీ ఎన్నికల విషయంలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.
Recommended Video

యూపీ ఎన్నికలపై రాజా సింగ్ వ్యాఖ్యలతో దుమారం
మంగళవారంనాడు రాజా సింగ్ హైదరాబాద్ లో యూపీలో జరుగుతున్న ఎన్నికల పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. యూపీలో వేల సంఖ్యలో జెసిబి లను, బుల్డోజర్ లను యోగి తెప్పించారని, ఎన్నికల తర్వాత యోగి కి ఎవరెవరు మద్దతు ఇవ్వలేదో వారందరినీ అన్ని ప్రాంతాలలో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇక జెసిబి, బుల్డోజర్ ఎందుకు వస్తాయో మీకు తెలుసు కదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యోగి మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే మీరు యూపీలో ఉంటారో .. రాష్ట్రం వదిలి పారిపోతారో తేల్చుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు యూపీ విడిచి వెళ్లక తప్పదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ రాజా సింగ్ గురించి వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications