ఠాగూర్ పోయి ఠాక్రే వచ్చినా కాంగ్రెస్ పార్టీలో అంతే.. అందుకు రేవంత్‌రెడ్డి పాదయాత్రే సాక్ష్యం!!
రేవంత్ రెడ్డి పాదయాత్ర సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలపై మరోమారు చర్చ జరుగుతుంది. ఠాగూర్ పోయి ఠాక్రే వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఏమీ మారలేదని చెప్పుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసేలా చూడాలని అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలపడం మాత్రం ఎవరి వల్ల కాదు. మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నాడని ఆయనను సీనియర్లు వ్యతిరేకించడంతో, ఆయన స్థానంలో ఠాక్రే ను తీసుకువచ్చి పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేక పోతుంది.

రేవంత్ రెడ్డి పాదయాత్ర : కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం ఉందా?
టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పనిచేయాలని సీనియర్లకు సూచించినా, బతిమాలి బామాలి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. ఇక ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీ నేతల మధ్య సమన్వయం ఉందా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాక్షిగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు చర్చనీయాంశంగా మారాయి.

రేవంత్ పాదయాత్రలో కనిపించని సీనియర్లు
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్ల నుంచి సహకారం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనడానికి మల్లు రవి తప్ప వేరే సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ పాదయాత్రలో పాల్గొనలేదు. రేవంత్ పాదయాత్ర ముగిసేలోపు సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా జాయిన్ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా రేవంత్ పాదయాత్రలో పాల్గొనడానికి ఎవరు సుముఖంగా లేరు అన్నది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ.

రేవంత్ పాదయాత్ర: సాకులు చెప్పి తప్పించుకుంటున్న సీనియర్లు
కొంతమంది పార్లమెంటు సమావేశాలను సాకుగా చూపి పాదయాత్రకు డుమ్మా కొడితే, మరి కొంతమంది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సాకుగా చూపి రేవంత్ పాదయాత్రలో పాల్గొనకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి వంటి వారు ఎవరు భాగస్వామ్యం తీసుకోలేదు. ముందు ముందు వారు భాగస్వామ్యం తీసుకుంటారు అన్న నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే ఎవరికి లేదు.

మాణిక్ రావు ఠాక్రే ప్రయత్నాలు చేసినా మారని సీనియర్లు
ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేది లేదని తాను స్వయంగా పాదయాత్ర చేస్తానంటూ భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి సంగారెడ్డి లో పాదయాత్ర చేసిన తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇక సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య సమన్వయం కుదరచడానికి మాణిక్ రావు ఠాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చలేరని తేల్చి చెప్తున్నారు.

కాంగ్రెస్ లో అంతే ... రేవంత్ పాదయాత్రతో జరుగుతున్న చర్చ
దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు ఉన్నా, రేవంత్ రెడ్డి, సీతక్క తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు కనిపించకపోవడంతో ఆ లోటు కనిపిస్తుంది. ఇక ప్రస్తుత రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర చూస్తున్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో అంతే... ఎవరు మారినా.. ఏమి మారినా.. ఆ పార్టీలో నేతలు తీరు మారదు అంటూ చర్చించుకుంటున్నారు. హస్తం పార్టీకి నష్టం చేసేది ఆ పార్టీ నేతలే అని పలువురు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు.












Click it and Unblock the Notifications