బీసీ విద్యార్థుల రూ.20 లక్షలు విదేశీ స్కాలర్షిప్.. అప్లికేషన్స్ అప్పటివరకే!
తెలంగాణా రాష్ట్రంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలని భావించే విద్యార్థులకు శుభవార్త. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా మీరు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కలలు నేరవేర్చుకునేలా ఆర్ధిక సహకారం అందిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం దరఖాస్తులను తీసుకుంటోంది. అయితే తాజాగా దరఖాస్తుల విషయంలో మరో శుభవార్త చెప్పింది తెలంగాణా ప్రభుత్వం.
తెలంగాణలో విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పొడిగించింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట ఈనెల 15తో ముగియాల్సిన గడువు ఇప్పుడు నెలాఖరు వరకు పెరిగింది.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద సాయం. విదేశీ విద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ పథకాలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి.
అర్హతలు ఇవే:
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. వయస్సు 35 ఏళ్లు మించకూడదు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. GREలో 260 లేదా GMATలో 550 స్కోర్, TOEFLలో 60 లేదా IELTSలో 6.0 బ్యాండ్ అవసరం. తాజా నోటిఫికేషన్లోని నిబంధనలను తప్పనిసరిగా చూసుకోవాలి.దరఖాస్తు చేయాలంటే తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ (telanganaepass.cgg.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదాయ ధృవపత్రం, మార్కుల షీట్లు, పరీక్ష స్కోర్లు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది. విదేశాల్లో చదువుకోవాలనుకునే యువత ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. అర్హతలు సరిపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉందని గుర్తుంచుకోండి.













Click it and Unblock the Notifications
