తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త: ఖాతాల్లో రూ.930కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్!
తెలంగాణలో సంక్షేమ విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. ఒక్క నెలలోనే అదనంగా లక్షమంది విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుత ఏడాది పూర్తి ఫీజులు జమయ్యాయి. ఇంటర్ తర్వాతి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అదే విద్యా సంవత్సరంలోగా నిధులు అందించాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది.
దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన నాలుగు నెలల్లో మొత్తం 2.28 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.930 కోట్లు జమయ్యాయి. సగటున ఒక్కో విద్యార్థికి సుమారు రూ.40 వేల చొప్పున నిధులు అందినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో బోధన ఫీజులు రూ.811 కోట్లు, ఉపకార వేతనాలు రూ.119 కోట్లు ఉన్నాయి. ఏటా బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ.2,400 కోట్ల డిమాండ్ ఉండగా, నాలుగు నెలల్లోనే దాదాపు 39 శాతం నిధులు విడుదలైనాయి.

ప్రభుత్వం ప్రతి నెలా రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. నాలుగు నెలలకు రూ.వెయ్యి కోట్లు జమ చేయగా, అందులో రూ.930 కోట్లు ఇప్పటికే విద్యార్థుల ఖాతాల్లోకి చేరాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు నిధులు చెల్లించే ప్రక్రియలో సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ రోజూ దరఖాస్తుల పరిష్కార పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ఇప్పటివరకు 5.8 లక్షల మంది ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయగా, అందులో 4.79 లక్షల మంది తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ప్రస్తుతం అందిన దరఖాస్తుల్లో ఎక్కువగా రెన్యువల్ దరఖాస్తులే ఉన్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. నవంబరు నాటికి వైద్య విద్యతో సహా అన్ని కోర్సుల ప్రవేశాలు పూర్తికానున్నాయి.
కొత్త విధానం ప్రకారం నిధులు ఇకపై కళాశాలల యాజమాన్యాలకు కాకుండా నేరుగా విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమవుతున్నాయి. విద్యార్థులు ఆ మొత్తాన్ని ఏడు రోజుల్లోపు కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలన్న నిబంధన కూడా అమలులో ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది.
డిసెంబరు నాటికి రూ.1,800 కోట్లకు పైగా నిధులు జమ చేయాలని, మార్చి నాటికి ఉపకార వేతనాల బకాయిలు లేకుండా చూడాలని సంక్షేమ శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెద్దగా పెండింగ్‌లో ఉండేవి. ప్రైవేట్ కళాశాలలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సమయానుకూలంగా నిధులు విడుదల చేస్తూ విద్యార్థులు ఆర్థిక ఒత్తిడి లేకుండా చదువు కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications
