వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగాల జాతర.. దశలవారీగా నోటిఫికేషన్లు, గెట్ రెడీ!
తెలంగాణలో నిరుద్యోగులకు మరోసారి శుభవార్త. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తం 2,929 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 996 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మిగిలిన 1,933 పోస్టులకు ఆమోదం రావాల్సి ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ఈ నియామకాలను ప్రధానంగా తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టనుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ అనుమతి లభించిన 996 పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 198, ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 308, టెక్నీషియన్లు 290, బయోమెడికల్ ఇంజినీర్లు 14, ఫిజియోథెరపిస్టులు 46, రేడియోగ్రాఫర్లు 11, ల్యాబ్ టెక్నీషియన్లు 73, ఏఎన్‌ఎంలు 54 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకుల కార్యాలయం, ఆయుష్, ఎంఎన్‌జే, ఐపీఎం వంటి విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మిగిలిన 1,933 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 716, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 422, స్టాఫ్ నర్సులు 194, ల్యాబ్ టెక్నీషియన్లు 96, జూనియర్ అసిస్టెంట్లు 119, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు 238 ఉన్నాయి.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో, వైద్య విద్య సంచాలకుల పరిధిలోని మరిన్ని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా భర్తీకి ప్రతిపాదనలో ఉన్నాయి.ఇప్పటికే కొనసాగుతున్న 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని 1,931 ఎంపీహెచ్‌ఏ మహిళ పోస్టుల నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్-2కు సంబంధించిన 732 పోస్టులు, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎంపిక కూడా చివరి దశలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యారోగ్య శాఖలో ఇప్పటివరకు 16 వేల పోస్టులను భర్తీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వైద్య రంగంలో సిబ్బంది లోపాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తోంది. జిల్లా స్థాయి ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ నియామకాలు చేపడుతున్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ల కోసం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టీజీపీఎస్సీ వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications
